లోకేశ్ నాయకత్వం భేష్.. ఏపీ విద్యా విధానాన్ని పొగిడిన ప్రపంచ బ్యాంకు

  • ఏపీ విద్యా సంస్కరణలపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
  • దక్షిణాసియాకే ఏపీ ఆదర్శమన్న ప్రతినిధులు
  • మంత్రి నారా లోకేశ్‌తో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ
  • పాల్ ల్యాబ్స్, ఎఫ్ఎల్‌ఎన్ అమలుపై ప్రత్యేక అభినందన
  • ప్రపంచానికి ఏపీ దిక్సూచిగా నిలుస్తుందన్న లోకేశ్
ఏపీలో విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. రాష్ట్రంలో అమలవుతున్న 'సాల్ట్' వంటి కార్యక్రమాలు కేవలం దేశానికే కాకుండా, మొత్తం దక్షిణాసియాకే ఆదర్శంగా నిలుస్తున్నాయని కితాబిచ్చింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశమై తమ అభినందనలు తెలియజేసింది.

మంత్రి లోకేశ్‌తో జరిగిన ఈ సమావేశంలో, రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం విద్యా రంగంలో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా పాల్ (PAL) ల్యాబ్‌లు, గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ & న్యూమరసీ (FLN), పాఠశాల నాయకత్వ శిక్షణ వంటివి ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ నాయకత్వాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ ప్రశంసలపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంలో పాల్ ల్యాబ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఈ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థుల్లోని లోపాలను గుర్తించి, వారికి ప్రత్యేకంగా సహాయం అందించడం సులభమవుతుందని తెలిపారు. "గ్యారెంటీడ్ ఎఫ్ఎల్‌ఎన్ సాధించి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికే దిక్సూచిగా నిలబెడతామని" ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై, భాగస్వామ్యంపై చర్చించేందుకు త్వరలోనే మరోసారి సమావేశమవుతామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సాల్ట్-సమగ్ర శిక్ష ద్వారా జరుగుతున్న కృషిని కొనియాడుతూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎస్‌పీడీ బి. శ్రీనివాసరావుతో పాటు ప్రపంచ బ్యాంకు బృందాన్ని ఆయన అభినందించారు.

ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు క్రిస్టెల్ కౌమే, సౌమ్య బజాజ్, యిన్ విన్ ఖైన్, ప్రియాంక సాహూ తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News