Hussain Talat: భారత్‌తో ఓడినా మా స్థైర్యం దెబ్బతినలేదు.. ఆసియా కప్ మాదే: పాక్ ఆల్‌రౌండర్

Pakistan Star Hussain Talat Sends Asia Cup Trophy Message To India
  • భారత్‌తో ఓడినా జట్టు స్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదన్న హుస్సేన్ తలాత్ 
  • శ్రీలంకపై గెలుపుతో ఆత్మవిశ్వాసం పెరిగింద‌ని వ్యాఖ్య‌
  • మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఆసియా కప్ త‌మ‌దేన‌ని ధీమా
  • పాక్ జట్టులో మిడిల్ ఆర్డర్‌లో ఆడేందుకు ఆటగాళ్లు భయపడుతున్నారని వెల్ల‌డి
  • విఫలమైతే జట్టు నుంచి తొలగిస్తారనే భయమే కారణమ‌న్న ఆల్‌రౌండర్
ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాలైనప్పటికీ, తమ జట్టు స్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదని పాకిస్థాన్ ఆల్‌రౌండర్ హుస్సేన్ తలాత్ స్పష్టం చేశాడు. అయితే, తమ జట్టులో ఓ తీవ్రమైన సమస్య ఉందని, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఆటగాళ్లు ముందుకు రావడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నిన్న‌ శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్‌లో అజేయంగా 32 పరుగులు చేసిన తలాత్, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో పాకిస్థాన్ ఫైనల్ ఆశలు సజీవంగా నిలిచాయి.

మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో తలాత్ మాట్లాడుతూ... "భారత్‌తో ఓటమి తర్వాత ఎవరూ సంతోషంగా ఉండరు. కానీ మాలో నిరాశ లేదు. మా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. చుట్టూ విమర్శలు వస్తున్నాయని తెలుసు, కానీ వాటిని మేం పట్టించుకోలేదు" అని తెలిపాడు.

పాకిస్థాన్ బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం లోపించిందని, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ సమస్య జట్టును వేధిస్తోందని తలాత్ అంగీకరించాడు. "మా దేశంలో ఒకటి రెండు మ్యాచ్‌లలో విఫలమైతే చాలు, మీడియా, అభిమానులు అందరూ వెంటపడతారు. వెంటనే జట్టు నుంచి తొలగిస్తారు. దీంతో మిడిల్ ఆర్డర్‌లో ఆడేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఎందుకంటే అది చాలా కష్టమైన స్థానం. ఈ భయం వల్లే చాలామంది ఆటగాళ్లు ఆ స్థానంలో ఆడేందుకు ముందుకు రావడం లేదు" అని త‌లాత్ పేర్కొన్నాడు.

శ్రీలంకపై గెలుపు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నాడు. "ప్రస్తుతం జట్టులో వాతావరణం చాలా బాగుంది. మేం ఇంకా రెండే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలోనూ బాగా ఆడితే ఆసియా కప్ ట్రోఫీ మాదే అవుతుంది" అని ధీమా వ్యక్తం చేశాడు. ఫైనల్‌కు చేరాలంటే పాకిస్థాన్ గురువారం బంగ్లాదేశ్‌పై తప్పక గెలవాల్సి ఉంది.
Hussain Talat
Pakistan cricket
Asia Cup 2023
Pakistan vs India
Pakistan vs Sri Lanka
Middle order batting
Cricket news
Pakistan cricket team
Sri Lanka cricket
Bangladesh cricket

More Telugu News