బ్యాంకుల్లో మీ డబ్బులు మర్చిపోయారా?.. రూ. 67వేల కోట్లు వెనక్కి ఇచ్చేందుకు ఆర్‌బీఐ మెగా ప్లాన్!

  • దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ. 67,000 కోట్లకు పైగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు
  • అసలైన హక్కుదారులను గుర్తించేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక కార్యాచరణ
  • అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్
  • ‘ఉద్గమ్’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో డిపాజిట్ల వివరాల వెల్లడి
  • పదేళ్లుగా వాడని ఖాతాల్లోని డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నాలు
దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన వేల కోట్ల రూపాయలను వాటి అసలైన హక్కుదారులకు చేర్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక చర్యలు చేపట్టింది. సుమారు రూ. 67,000 కోట్లకు పైగా ఉన్న ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించి, వాటి యజమానులకు తిరిగి చెల్లించే ప్రక్రియను వేగవంతం చేయాలని బ్యాంకులను ఆదేశించింది.

అసలేంటి ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు?
పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపకుండా నిద్రాణంగా ఉన్న సేవింగ్స్, కరెంట్ ఖాతాలు, మెచ్యూరిటీ పూర్తయి పదేళ్లు దాటినా తీసుకోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వడ్డీలు, డివిడెండ్లు, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు వంటివన్నీ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల కిందకు వస్తాయి. నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని బ్యాంకులు ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేస్తాయి.

గ్రామాలపై ప్రత్యేక దృష్టితో కార్యాచరణ
ఈ డిపాజిట్లకు సంబంధించిన యజమానులు లేదా వారి వారసులను గుర్తించేందుకు ఆర్‌బీఐ ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. స్థానిక భాషల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించి, ప్రజలను చైతన్యవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు (ఎస్‌ఎల్‌బీసీ) ఈ డిపాజిట్ల డేటాను విశ్లేషించి, యజమానులను గుర్తించేందుకు స్థానికంగా ప్రయత్నాలు చేస్తాయి.

'ఉద్గమ్' పోర్టల్‌తో సులభంగా సమాచారం
సామాన్య ప్రజలు తమకు తెలియకుండా బ్యాంకుల్లో ఉండిపోయిన డబ్బుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఆర్‌బీఐ 'ఉద్గమ్' (Unclaimed Deposits - Gateway to Access Information) పేరుతో ఒక ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో దేశంలోని 30 ప్రధాన బ్యాంకులకు చెందిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇది అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లలో దాదాపు 90 శాతం విలువను కవర్ చేస్తుంది.

ఇక బీమా రంగంలో కూడా పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని పాలసీ మొత్తాలను వడ్డీ సహా సీనియర్ సిటిజన్ల సంక్షేమ నిధికి (ఎస్‌సీడబ్ల్యూఎఫ్) బదిలీ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. అయితే, ఈ నిధికి బదిలీ చేసిన 25 ఏళ్ల వరకు కూడా పాలసీదారులు లేదా వారి వారసులు తమ డబ్బును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.


More Telugu News