Dickie Bird: దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూత

Dickie Bird Legendary Cricket Umpire Passes Away
  • నిన్న రాత్రి తన నివాసంలో తుది శ్వాస విడిచిన డికీ బర్డ్
  • మరణవార్తను అధికారికంగా ధ్రువీకరించిన యార్క్‌షైర్ కౌంటీ క్లబ్
  • 66 టెస్టులు, 69 వన్డేలకు అంపైర్‌గా సేవలు
క్రికెట్ ప్రపంచంలో సుపరిచితమైన పేరు, దిగ్గజ అంపైర్ హెరాల్డ్ డికీ బర్డ్ (92) కన్నుమూశారు. మంగళవారం రాత్రి తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ఒక ప్రకటనలో ధృవీకరించింది. 

70ల నుంచి 90ల మధ్య కాలంలో క్రికెట్‌ను వీక్షించిన వారికి డికీ బర్డ్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తనదైన శైలితో, కచ్చితమైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1973 నుంచి 1996 వరకు సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో సేవలందించిన ఆయన, మొత్తం 66 టెస్టులు, 69 వన్డే మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. 1996లో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆయన కెరీర్‌లో చివరిది.

భారత క్రికెట్‌తో కూడా ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వంటి భారత దిగ్గజ ఆటగాళ్లు ఆయన అంపైరింగ్ చేస్తున్న కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అంపైర్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందకముందు, డికీ బర్డ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కూడా. యార్క్‌షైర్ కౌంటీ క్లబ్ తరఫున 93 మ్యాచ్‌లు ఆడి 3,314 పరుగులు సాధించారు.

డికీ బర్డ్ మృతి పట్ల సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ సహా పలువురు భారత మాజీ దిగ్గజాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. 
Dickie Bird
Harold Dickie Bird
cricket umpire
Yorkshire County Cricket Club
Sunil Gavaskar
Kapil Dev
Sachin Tendulkar
Sourav Ganguly
India cricket

More Telugu News