Hasaranga-Abrar: నీ స్టైల్ నాది.. నా స్టైల్ నీది.. పాక్-లంక మ్యాచ్‌లో ఫన్నీ ఫైట్..!

Abrar Ahmed and Wanindu Hasaranga Funny Fight in Pakistan vs Sri Lanka Match
  • ఆసియా కప్‌లో పాక్‌ చేతిలో లంక ఓటమి
  • మ్యాచ్‌ను రక్తి కట్టించిన సెలబ్రేషన్ల వార్
  • హసరంగను ఔట్ చేసి అతడి స్టైల్‌లోనే అబ్రార్ సంబరాలు
  • అదే రీతిలో అబ్రార్‌కు రివేంజ్ తీర్చుకున్న హసరంగ
  • మ్యాచ్ తర్వాత నవ్వుతూ కౌగిలించుకున్న ఇద్దరు ప్లేయర్లు
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆట కంటే ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఓ ఫన్నీ వార్ హైలైట్‌గా నిలిచింది. ఒకరి సెలబ్రేషన్ స్టైల్‌ను మరొకరు అనుకరిస్తూ మైదానంలో సందడి చేశారు. అయితే, చివరికి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో పాకిస్థాన్ విజయం సాధించింది.

శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ జట్టు ఆటగాడు వనిందు హసరంగను పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం హసరంగ స్టైల్‌లోనే సంబరాలు చేసుకుని అతడిని రెచ్చగొట్టాడు. దీనికి బదులుగా పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో ఫకర్ జమాన్ క్యాచ్ అందుకున్న హసరంగ, అబ్రార్ స్టైల్‌ను అనుకరిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా వికెట్లు తీసిన ప్రతీసారి అబ్రార్‌ను అనుకరిస్తూనే సంబరాలు చేసుకుని ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే, ఇదంతా మైదానంలో సరదాగా జరిగిందేనని, మ్యాచ్ ముగిశాక ఇద్దరూ నవ్వుతూ ఆలింగనం చేసుకోవడం క్రీడాస్ఫూర్తిని చాటింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, అబుదాబీ వేదికగా జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ కమిందు మెండీస్ (50) అర్ధ సెంచరీతో రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా, హారిస్ రవూఫ్, హుస్సేన్ తలాత్ చెరో రెండు వికెట్లు తీశారు.

134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో హుస్సేన్ తలాత్ (32 నాటౌట్), మహమ్మద్ నవాజ్ (38 నాటౌట్) అద్భుత భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్‌కు విజయాన్ని అందించారు.
Hasaranga-Abrar
Abrar Ahmed
Pakistan vs Sri Lanka
Asia Cup 2025
Wanindu Hasaranga
cricket match
funny fight
celebration style
cricket rivalry
sportsmanship
Hussein Talat

More Telugu News