Prakhar Jain: ప్రకాశం బ్యారేజీకి మళ్లీ భారీగా వరద ప్రవాహం .. నాలుగు లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి

Prakhar Jain Heavy Floods to Prakasam Barrage Water Released into Sea
  • ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులు
  • ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
  • లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నెలలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మళ్లీ ఇప్పుడు వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీటితో కృష్ణా, గోదావరి నదులు ఉరకలెత్తుతూ సముద్రంలో కలుస్తున్నాయి.

కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ క్రమంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహంపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 6:30 గంటల నాటికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ రోజు సాయంత్రానికి 4.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు గోదావరి వరద ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 3.97 లక్షల క్యూసెక్కులు ఉండగా, 4 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నెల 28 నాటికి క్రమంగా పెరుగుతూ దాదాపుగా మొదటి హెచ్చరిక స్థాయికి దగ్గరగా 9.5-10 లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు.

అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఘాట్లలో 5 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు, కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక ఎస్‌డీఆర్ఎఫ్ బృందం, తిరుమలలో రెండు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను ఉంచినట్లు తెలిపారు.

ఆయా నదీ పరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. జిల్లా యంత్రాంగం అవసరమైతే ప్రభావిత లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24/7 అందుబాటులో ఉండాలన్నారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
  • పవిత్ర స్నానమాచరించే నదీ ఘాట్ల వద్ద భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
  • నది ఒడ్డున/ ఘాట్లలో భద్రతా చర్యలకు పోలీసు, నీటిపారుదల, మునిసిపల్ సిబ్బందిని నియమించాలి.
  • నది ప్రమాద స్థాయి తెలియజేయడానికి బారికేడింగ్‌లు, హెచ్చరిక సూచనలు, బహిరంగ ప్రకటనలను ఏర్పాటు చేయాలి.
సురక్షితమైన దర్శన ఏర్పాట్లకు ఆలయ అధికారులతో సమన్వయ పరుచుకోవాలని ప్రఖర్ జైన్ సూచనలు జారీ చేశారు. 
Prakhar Jain
Prakasam Barrage
Krishna River
Godavari River
Andhra Pradesh Floods
Telangana Rains
AP Disaster Management
Dussehra Navaratri
Flood Warning
River Inflow

More Telugu News