GST: జీఎస్టీ ప్రయోజనం అందడం లేదా?.. ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి!

GST Benefits Not Reaching You File a Complaint on These Numbers
  • జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందేలా కేంద్రం చర్యలు
  • ఫిర్యాదుల కోసం 1915 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
  • వాట్సాప్ ద్వారా ఫిర్యాదుకు 88000 01915 నెంబర్ అందుబాటులోకి
  • 54 రకాల నిత్యావసర వస్తువుల ధరలపై ప్రత్యేక నిఘా
  • ధరల మార్పులపై ప్రతినెలా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  • ఈ-కామర్స్ సంస్థలపైనా దృష్టి సారించిన ప్రభుత్వం
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల తర్వాత తగ్గిన ధరల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందుతున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జీఎస్టీ కారణంగా తగ్గిన ధరలకు అనుగుణంగా వ్యాపారులు వస్తువులను విక్రయించని పక్షంలో, వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి 1915 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను, 88000 01915 అనే వాట్సాప్ నెంబర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎవరైనా వ్యాపారులు జీఎస్టీ ప్రయోజనాలను బదిలీ చేయకుండా అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే, ఈ నెంబర్లకు ఫోన్ చేసి గానీ, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపి గానీ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. వీటితో పాటు, ప్రభుత్వానికి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం (ఐఎన్‌జీఆర్‌ఏఎం) పోర్టల్ ద్వారా కూడా తమ సమస్యలను తెలియజేయవచ్చు.

మరోవైపు, ప్రజలు ఎక్కువగా ఉపయోగించే 54 రకాల ఉత్పత్తుల ధరల మార్పులపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వెన్న, షాంపూ, టూత్‌పేస్ట్, ఐస్‌క్రీమ్, ఏసీ, టీవీ, సిమెంట్‌తో పాటు గ్లూకోమీటర్ వంటి కీలక వస్తువుల ధరలను నిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. ఈ ఉత్పత్తుల ధరల్లో వస్తున్న మార్పులపై ప్రతి నెలా తమకు నివేదిక సమర్పించాలని ఈ నెల 9వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో, తొలి నివేదికను సెప్టెంబర్ 30వ తేదీలోగా అందజేయాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ సంస్థలు కూడా తగ్గిన ధరలకే వస్తువులను అందిస్తున్నాయా లేదా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.
GST
GST Benefits
Consumer complaints
CBIC
Integrated Grievance Redressal Mechanism
INGRAM
Tax reforms
Price monitoring
Toll-free number
Whatsapp number

More Telugu News