బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు

  • బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటిగా రెండు అల్పపీడనాలు
  • గురువారం ఏర్పడనున్న రెండో అల్పపీడనం
  • శుక్రవారానికి వాయుగుండంగా మార్పు
  • శనివారం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం
  • రానున్న నాలుగు రోజులు కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటిగా రెండు అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటిలో ఒకటి వాయుగుండంగా బలపడి తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం గురువారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వేగంగా పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించి శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం శనివారం నాటికి ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా నిన్న ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది.

ఈ అల్పపీడన ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అత్యధికంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే అనకాపల్లి జిల్లా రాజాంలో 6.2, అల్లూరి జిల్లా కిలగదలో 5.9, విజయనగరం జిల్లా బొద్దాంలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు. వరుస అల్పపీడనాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


More Telugu News