గుంటూరు జిల్లాలో కలరా కలకలం.. నాలుగు కేసుల నిర్ధారణ

  • కలరా కేసుల నిర్ధారణతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
  • ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్
  • పాత గుంటూరులోని బాలాజీ నగర్ ప్రాంతాన్ని హాట్ స్పాట్‌గా ప్రకటించిన అధికారులు
గుంటూరు జిల్లాలో కలరా వైరస్ కలకలం రేపుతోంది. గుంటూరు నగరంలో మూడు, తెనాలిలో ఒకటి కలిపి మొత్తం నాలుగు కలరా కేసులు నిన్న నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత ఐదు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 146 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరగా, వీరిలో కొందరి నుంచి సేకరించిన నమూనాల్లో విబ్రియో కలరే బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారించారు.

ల్యాబ్ పరీక్షల్లో కలరా నిర్ధారణ  

గుంటూరు జీజీహెచ్‌తో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల నుంచి 114 నమూనాలు సేకరించగా, గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ ల్యాబ్‌లో పరీక్షించిన 91 నమూనాల్లో 3 నమూనాల్లో విబ్రియో కలరే, 16 నమూనాల్లో ఈ.కోలి బ్యాక్టీరియా, ఒకదానిలో షిగెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారించారు. మిగిలిన 71 నమూనాల్లో ఎలాంటి బ్యాక్టీరియా లేదని తేలింది.

పాత గుంటూరులో హాట్‌స్పాట్ ప్రకటన

పాత గుంటూరులోని బాలాజీ నగర్ ప్రాంతాన్ని అధికార యంత్రాంగం కలరా హాట్‌స్పాట్‌గా ప్రకటించింది. కాలుష్య నీరు ప్రధాన కారణంగా భావిస్తూ ఇంటింటి సర్వేలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

చర్యలకు కమిషనర్‌ ఆదేశాలు

ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ హూటాహుటిన గంటూరు కలెక్టరేట్‌కు చేరుకుని ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గుంటూరు నగరంలో 57 డివిజన్లకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 4 వార్డు కార్యదర్శులు, ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్, టీపీఓ లేదా టీపీఎస్, నోడల్ అధికారి ఉండేలా జాబితాలు రూపొందించారు.

పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు: సూపరింటెండెంట్ ఇంజినీర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సిటీ ప్లానర్ లను పర్యవేక్షణ బాధ్యతలతో నియమించారు.

చర్యలు ఇలా..

ప్రజారోగ్య విభాగం అన్ని డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు బ్లాక్‌స్పాట్స్ వద్ద చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లించాలి.
ఇంజినీరింగ్ విభాగం తాగునీటి పైపులపై కలుషిత మురుగునీటి ప్రభావాన్ని తొలగించే చర్యలతో పాటు రోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరదనీరు తొలగింపు, కీలక ప్రాంతాల్లో రెసిడ్యుయల్ క్లోరిన్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాలు నమోదు చేయాలి.
పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో డ్రెయిన్లపై ఆక్రమణల తొలగింపు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. 


More Telugu News