పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి తీసుకురావొద్దు: పవన్ కల్యాణ్

  • పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించిన పవన్ కల్యాణ్
  • పిసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలనుకునే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచన
పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదే సమయంలో పరిశ్రమల అభివృద్ధికి అడ్డుపడే విధంగా వ్యవహరించకూడదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులతో అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలపైనా మరోసారి సమీక్షించారు.

పీసీబీ (కాలుష్య నియంత్రణ మండలి) కీలక భూమిక పోషించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలనుకునే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటూనే, కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

“పెట్టుబడులు వచ్చేలా ప్రోత్సహించాలి. కానీ పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయే పరిస్థితులు రాకూడదు” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ వంటి ప్రమాదాలు మళ్లీ జరగకూడదని, ప్రజల ప్రాణాలకు ముప్పు వచ్చే స్థితిని సహించేది లేదని హితవు పలికారు.

విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న ఫార్మా సంస్థలపై పర్యవేక్షణ పెంచాలని, కాలుష్య నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు. పీసీబీ సిబ్బంది పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భావితరాలకు శుభ్రమైన గాలి, నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 


More Telugu News