మంత్రి నారా లోకేశ్‌ చొరవతో పొలం వదిలి... కలం పట్టిన చిన్నారి

  • చిలకలడోన కేజీబీవీలో చేరిన జెస్సీ
  • హామీ ఇచ్చిన 24 గంటల్లో జెస్సీ చదువు కల నెరవేర్చిన మంత్రి లోకేష్ 
  • నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
మొన్నటి వరకు పత్తి చేలో కూలీగా పనిచేసిన ఆ పాలబుగ్గల చిన్నారి, తనకు చదువుకోవాలని ఉందని చెప్పింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పందిస్తూ "చిట్టి తల్లీ, నిశ్చింతగా చదువుకో" అని భరోసా ఇచ్చారు. మంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే చిన్నారి జెస్సీ పొలం వదిలి కలం పట్టింది. జెస్సీ చిలకలడోన కేజీబీవీలో చేరిపోయింది. ఇది విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చొరవతోనే సాధ్యమైంది.

పిల్లలంటే నారా లోకేశ్‌కు పంచప్రాణాలు. వారు చదువుకు దూరమైతే ఆయన తట్టుకోలేరు. ఎక్కడికెళ్లినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పిల్లలు కనిపిస్తే వారిని ఎత్తుకుని, లాలించి, నవ్వించి వారి ఆనందంలో తన ఆనందం చూసుకుంటారు.

ఆయన వెంట చిన్నారుల కోసం చాక్లెట్ల బ్యాగు కూడా ఉంటుంది. పాదయాత్రలో ఒక పిల్లాడు పార్టీ జెండా పట్టుకుని కనిపిస్తే ఆ జెండాను తీసుకొని నువ్వు ఉండాల్సింది బడిలో అంటూ పంపించిన యువనేత నారా లోకేశ్‌. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యంతో విద్యాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచిన విద్యాశాఖ మంత్రి ఆయన. బడిలో ఉండాల్సిన బాలిక పత్తి చేలో కూలి పనులు చేస్తుంటే ఆయన ఎలా తట్టుకోగలరు? "నాకు చదువుకోవాలని ఉంది సార్" అని చిట్టితల్లి అడిగితే విద్యా మంత్రి క్షణమైనా ఆగగలరా?

మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబమైన మీనిగ కుమార్, సంతోషమ్మలకు ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు ప్రభాస్ ఏడో తరగతి నందవరం ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్నాడు. మూడో కుమార్తె మను గ్రామంలోనే ప్రభుత్వం పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. రెండో కుమార్తె జెస్సీ ఊర్లో ఐదవ తరగతి పూర్తి చేసింది. అయితే సమీప కేజీబీవీలో సీట్లు నిండిపోయాయి.

దీంతో తల్లిదండ్రులు జెస్సీని తమతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పత్తి పనులకు తీసుకెళ్లారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన జెస్సీ తనకు సీటు వస్తే చదువుకోవాలని ఉందని మీడియా ప్రతినిధులతో చెప్పింది. ఆ కథనం చూసి విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ చలించిపోయారు.

"చిట్టితల్లి నిశ్చింతగా చదువుకో" అని భరోసా ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన 24 గంటల్లో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, కేజీబీవీ అధికారులు, డీఈఓ శామ్యూల్ పాల్, ఎంఈవో 2 రాగన్న జెస్సీని చిలకలడోన కేజీబీవీ ఆరో తరగతిలో చేర్పించారు. పత్తి చేలో నుంచి పాఠాలు చెప్పే బడిలో చేరిన జెస్సీ ఆనందానికి అవధులు లేవు. చిన్నారి తల్లిదండ్రులు మంత్రి నారా లోకేశ్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. బడి బయట ఉన్న బాలిక బడిలో చేరిన సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు చిన్నారి జెస్సీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి కస్తూర్బా గాంధీ విద్యాలయంలోకి సాదరంగా ఆహ్వానించారు.


More Telugu News