మీ నంబర్ బ్లాక్ చేస్తాం... సుధామూర్తికే టోకరా వేసేందుకు సైబర్ నేరగాళ్ల యత్నం

  • ఎంపీ సుధామూర్తిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు
  • టెలికాం అధికారిమంటూ ఫోన్ చేసి వివరాలు రాబట్టే యత్నం
  • మీ నంబర్‌తో అసభ్యకర సందేశాలు.. బ్లాక్ చేస్తామంటూ బెదిరింపు
  • మోసంపై పోలీసులకు ఫిర్యాదు.. ఎఫ్‌ఐఆర్ నమోదు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్ధాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తినే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడేందుకు యత్నించారు. కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ అధికారులమని నమ్మించి, ఆమె వ్యక్తిగత వివరాలు రాబట్టడానికి విఫలయత్నం చేశారు. ఈ ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 5న ఉదయం 9:40 గంటల సమయంలో సుధామూర్తికి ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను కేంద్ర టెలికాం శాఖ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. ఆమె మొబైల్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం కాలేదని, ఆ నంబర్ నుంచి అసభ్యకరమైన సందేశాలు వెళుతున్నాయని ఆరోపించాడు. వెంటనే స్పందించకపోతే మధ్యాహ్నంలోగా నంబర్‌ను బ్లాక్ చేస్తామని బెదిరించాడు. అయితే, ఆ వ్యక్తి ప్రవర్తనపై అనుమానం రావడంతో సుధామూర్తి అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత ఆ నంబర్‌ను ట్రూకాలర్‌లో పరిశీలించగా ‘టెలికాం డిపార్ట్‌మెంట్’ అని కనిపించడం గమనార్హం. ఈ మోసపూరిత యత్నంపై సుధామూర్తి తరఫున గణపతి అనే వ్యక్తి జాతీయ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సెప్టెంబర్ 20న సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరో ఎంపీ భార్యకు రూ.14 లక్షల టోకరా

ఇదే తరహాలో చిక్కబళ్లాపూర్ బీజేపీ ఎంపీ కె. సుధాకర్ భార్య ప్రీతి కూడా సైబర్ మోసానికి గురైన ఘటన సోమవారం వెలుగు చూసింది. ముంబై సైబర్ క్రైమ్ అధికారులమంటూ ఆగస్టు 26న ఆమెకు వాట్సాప్ కాల్ చేసిన కేటుగాళ్లు, ఆమె బ్యాంకు ఖాతాలోకి అక్రమంగా డబ్బు బదిలీ అయిందని నమ్మించారు. ఈ క్రమంలో ఆమె నుంచి ఏకంగా రూ.14 లక్షలు కాజేశారు. అయితే, బాధితురాలు వెంటనే ఫిర్యాదు చేయడంతో సైబర్ పోలీసులు వేగంగా స్పందించారు. కేవలం వారం రోజుల్లోనే మోసపూరితంగా బదిలీ అయిన ఆ డబ్బును ఫ్రీజ్ చేసి, తిరిగి బాధితురాలికి అందజేశారు.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో బెంగళూరు వెస్ట్ డీసీపీ ఎస్. గిరీశ్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సైబర్ మోసాల బారిన పడి డబ్బులు కోల్పోతే ఆందోళనతో సమయం వృథా చేయవద్దని కోరారు. వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘గోల్డెన్ అవర్’లో స్పందిస్తే నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News