Donald Trump: ట్రంప్ హెచ్-1బీ వీసా దెబ్బ: టేకాఫ్‌కు ముందు విమానం దిగేసిన భారతీయులు

Donald Trump H1B Visa Impact Indians Deplane Before Takeoff
  • ట్రంప్ హెచ్-1బీ వీసా నిర్ణయంతో తీవ్ర గందరగోళం
  • టేకాఫ్‌కు ముందు ఎమిరేట్స్ విమానం దిగేసిన భారతీయులు
  • మూడు గంటల పాటు ఆలస్యమైన విమాన ప్రయాణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాలపై తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తీవ్ర గందరగోళానికి దారితీసింది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి లక్ష డాలర్ల ఫీజు విధిస్తున్నట్లు ప్రకటించడంతో భయాందోళనలకు గురైన పలువురు భారతీయ ప్రయాణికులు, టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానం నుంచి కిందకు దిగిపోయారు. ఈ అనూహ్య పరిణామంతో శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేగింది.

వివరాల్లోకి వెళితే, శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి భారత్‌కు బయలుదేరాల్సిన ఎమిరేట్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే, అమెరికాను విడిచి వెళితే తిరిగి రాలేమేమోనన్న ఆందోళనతో ప్రయాణికులు విమానం దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రయాణికులు తమ ఫోన్లలో వార్తలు చూస్తూ, ఏం చేయాలో తెలియక ఆందోళన చెందారు. పరిస్థితిని గమనించిన విమాన కెప్టెన్, ప్రయాణం రద్దు చేసుకోవాలనుకునే వారు విమానం నుంచి దిగిపోవచ్చని ప్రకటించారు. ఈ ఘటన కారణంగా విమానం సుమారు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

ఈ పరిణామాలపై ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో వీడియోలను పంచుకున్నారు. "ఇది పూర్తి గందరగోళం. ట్రంప్ నిర్ణయంతో భారతీయ ప్రయాణికుల్లో భయం నెలకొంది. చాలా మంది విమానం దిగిపోవడానికే మొగ్గు చూపారు" అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.

మరోవైపు, ట్రంప్ నిర్ణయంతో అప్రమత్తమైన మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు కీలక సూచనలు జారీ చేశాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసా హోల్డర్లు కనీసం రెండు వారాల పాటు దేశం విడిచి వెళ్లవద్దని కోరాయి. అలాగే, విదేశాల్లో ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లోగా తిరిగి అమెరికాకు రావాలని సూచించాయి.

ఈ గందరగోళంపై వైట్‌హౌస్ స్పష్టత ఇచ్చింది. లక్ష డాలర్ల ఫీజు అనేది కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, అది కూడా ఒక్కసారి చెల్లించే ఫీజు అని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. ప్రస్తుత వీసా హోల్డర్లకు, పునరుద్ధరణలకు ఈ నిబంధన వర్తించదని ఆమె స్పష్టం చేశారు. అమెరికన్ కార్మికులకు బదులుగా తక్కువ నైపుణ్యం ఉన్న విదేశీయులను నియమించడాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ యంత్రాంగం తెలిపింది.
Donald Trump
H-1B Visa
Indian travelers
San Francisco airport
US Immigration
Visa fee
Meta
Microsoft
Immigration policy
White House

More Telugu News