Rajnath Singh: యుద్ధం అక్కర్లేదు... పీవోకే మనదే అవుతుంది: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh Says No War Needed POK Will Be Ours
  • మొరాకో పర్యటనలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి రాజ్ నాథ్ ప్రసంగం
  • పీవోకే ప్రజలు మేం కూడా భారతీయులమే అంటున్నారని వెల్లడి 
  • పీవోకే తనంత తానే భారత్ లో విలీనం అవుతుందని వ్యాఖ్యలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, అది తనంతట తానుగానే భారత్‌లో విలీనం అవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పీవోకేలో పరిస్థితులు మారుతున్నాయని, అక్కడి ప్రజలే పాకిస్థాన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. మొరాకో పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

పీవోకేలో ప్రజలు పాకిస్థాన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, స్వేచ్ఛ కోసం ఉద్యమిస్తున్నారని ఆయన తెలిపారు. "పీవోకేలో డిమాండ్లు ఇప్పటికే మొదలయ్యాయి. మీరు నినాదాలు వినే ఉంటారు. 'నేను కూడా భారతీయుడినే' (మెయిన్ భీ భారత్ హూన్) అంటూ అక్కడ నినాదాలు మిన్నంటున్నాయి. కాబట్టి మనం బలప్రయోగం చేయాల్సిన అవసరం రాదు" అని రాజ్‌నాథ్ వివరించారు. ఐదేళ్ల క్రితం కశ్మీర్ లోయలో సైనికులతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని తాను చెప్పానని ఆయన గుర్తుచేశారు.

పీవోకేను తిరిగి చేజిక్కించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్' సమయంలో చేజార్చుకుందంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మే 7న జరిగిన ఆ ఆపరేషన్‌లో భారత్‌కు పైచేయి ఉన్నప్పటికీ, కేవలం కాల్పుల విరమణ ఒప్పందంతో సరిపెట్టుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇదే ప్రసంగంలో, ఇతర దేశాల చర్యలపై భారత్ సంయమనంతో వ్యవహరిస్తుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించినా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు 25% జరిమానా విధించినా తాము వెంటనే స్పందించలేదని అన్నారు. "విశాల హృదయం ఉన్నవారు ప్రతీదానికి వెంటనే స్పందించరు" అంటూ ఆయన భారత దౌత్య వైఖరిని పరోక్షంగా సమర్థించుకున్నారు.
Rajnath Singh
POK
Pakistan Occupied Kashmir
India
Morocco
Operation Sindoor
Kashmir
Indian Foreign Policy
Defense Minister India

More Telugu News