Chandrababu Naidu: ఏపీలో సరికొత్త డిజిటల్ శకం... జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు కీలక ప్రసంగం

Chandrababu Naidu Addresses National eGovernance Conference on Digital Transformation in AP
  • విశాఖలో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • వాట్సాప్ ద్వారా 751 పౌరసేవలు అందిస్తున్నట్లు వెల్లడి
  • సాంకేతికతతోనే ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యమని స్పష్టీకరణ
  • ఐబీఎం, టీసీఎస్‌లతో కలిసి ఏపీలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
  • సంజీవని ప్రాజెక్టును దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని వ్యాఖ్య
  • ఏపీకి సెమీ కండక్టర్ పరిశ్రమ కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తీసుకురావడమే లక్ష్యమని, డిజిటల్ పరివర్తన ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజల మొబైల్ ఫోన్లకే చేర్చేలా రాష్ట్రంలో ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 751 రకాల పౌర సేవలను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. సోమవారం విశాఖపట్నంలో కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 'సివిల్ సర్వీసెస్ - డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్' అనే ప్రధాన ఇతివృత్తంతో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీ, ఈ-గవర్నెన్స్‌పై దృష్టి సారించడం వల్ల పాలనలో గణనీయమైన మార్పులు వచ్చాయని, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన సంస్కరణలు ప్రజా జీవితంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలోనే ఈ-సేవ, మీ-సేవ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లామని, ఇప్పుడు ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ వంటి విధానాలతో నిర్ణయాలు వేగవంతం అయ్యాయని వివరించారు. అయితే, సాంకేతికతను వినియోగించుకుంటున్న క్రమంలో సైబర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ, సంజీవని ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలో "క్వాంటం వ్యాలీ"ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దీని ద్వారా క్వాంటం కంప్యూటింగ్ సేవలను ప్రభుత్వ, విద్య, వైద్య రంగాలకు అందుబాటులోకి తీసుకురావచ్చని, ఇక్కడ ఒక బలమైన ఎకో సిస్టం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్వాంటం కంప్యూటర్ల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు. 

మరోవైపు వైద్య రంగంలో టెక్నాలజీని అనుసంధానిస్తూ 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించామని, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అమలు కావడానికి ఆస్కారం ఉందని ఆయన అన్నారు.

దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది

రానున్న పదేళ్లు దేశానికి అత్యంత కీలకమని, సాంకేతికత కారణంగా సేవలు, ఉద్యోగాలు, ఉత్పాదక రంగాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయని చంద్రబాబు విశ్లేషించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘స్వదేశీ ఉత్పత్తుల’ నినాదాన్ని స్వాగతిస్తున్నామని, దేశంలో తయారైన ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి ఒక సెమీ కండక్టర్ పరిశ్రమను కేటాయించినందుకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో బీపీఓ విధానం ద్వారా యువతకు ఉద్యోగాలు లభించాయని, కానీ ఇప్పుడు కొన్ని యాప్‌ల ద్వారా వస్తున్న ఆర్థిక ప్రయోజనాలు విదేశాలకు తరలిపోతున్నాయని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. 

సమీప భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్‌టెక్ పార్కుల ద్వారా జాతీయ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన భాగస్వామి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం, సదస్సులో భాగంగా 'డిజిటల్ ఏపీ' సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌తో పాటు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
e-governance
digital transformation
National e-Governance Conference
Manamitra
Quantum Valley
Sanjeevani Project
IT sector
cyber security

More Telugu News