Ranganath: ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్ల విలువైన భూములను రక్షించాం: హైడ్రా కమిషనర్

HYDRA Saved Lands Worth 500 Billion Rupees
  • ఇప్పటి వరకు 923 ఎకరాలను ఆక్రమణల నుంచి రక్షించామన్న కమిషనర్
  • హైదరాబాద్ నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయన్న కమిషనర్
  • డీఆర్ఎఫ్ బృందాలను పెంచుతామన్న రంగనాథ్
హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి విడిపించామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయని అన్నారు. ఆరు చెరువులకు పూర్తిస్థాయిలో పునరుజ్జీవం కల్పించామని వెల్లడించారు.

గాజులరామారంలో కొందరు రౌడీషీటర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆయన తెలిపారు. ఆదివారం అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించామని వెల్లడించారు. నకిలీ పట్టాలు సృష్టించి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ భూమిలోని 260 నిర్మాణాలను తొలగించామని ఆయన అన్నారు. ప్రస్తుతం 51 డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని, త్వరలోనే వాటి సంఖ్యను 72కు పెంచుతామని అన్నారు.

నగరంలో 150 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు ఉన్నాయని తెలిపారు. నాలాల వద్ద ఆక్రమణలు గుర్తించి తొలగిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. వాటిలో పూడికతీత పనులను ముమ్మరం చేశామని అన్నారు. అధిక కాలుష్యం కారణంగా నగరాల్లోనే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని రంగనాథ్ తెలిపారు. భవిష్యత్తు అంతా యువతదే కాబట్టి, జెన్ జెడ్ తరం పార్కులు, చెరువుల గురించి ఆలోచించాలని సూచించారు.
Ranganath
HYDRA
Hyderabad
Telangana
Government Lands
Land Encroachment
Lakes Restoration

More Telugu News