సూర్యాపేటలో బోల్తాపడ్డ కొబ్బరి బొండాల లారీ.. రూ.2 లక్షల సరుకును ఎత్తుకెళ్లిన జనం

  • జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయిన కొబ్బరికాయలు
  • సరుకు కోసం ఎగబడిన స్థానికులు, ప్రయాణికులు
  • బస్తాలు, సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లిన వైనం
  • సుమారు రూ.2 లక్షల నష్టం జరిగిందని డ్రైవర్ ఆవేదన
  • క్రేన్‌తో లారీని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు
ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆదుకోవాల్సింది పోయి, వారి నష్టాన్ని అవకాశంగా మలుచుకున్నారు కొందరు. సూర్యాపేట మండలం రాయన్నగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఈ ఘటనకు అద్దం పట్టింది. కొబ్బరి బొండాలతో వెళ్తున్న లారీ బోల్తా పడగా, అందులోని సరుకు కోసం స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఎగబడ్డారు.

వివరాల్లోకి వెళితే... నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కొబ్బరి బోండాల లోడుతో ఓ లారీ బయలుదేరింది. సూర్యాపేట సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదంతో లారీలోని కొబ్బరి బొండాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సాయం చేయాల్సింది పోయి, రోడ్డుపై పడిన కొబ్బరి బొండాలను ఏరుకెళ్లేందుకు పోటీపడ్డారు. చేతికి అందినవాటిని అందినట్టుగా సంచుల్లో, బస్తాల్లో నింపుకొని ఇళ్లకు తరలించారు. అటుగా కార్లలో వెళ్తున్న కొందరు ప్రయాణికులు సైతం వాహనాలు ఆపి మరీ కొబ్బరి బొండాలను ఎత్తుకెళ్లడం గమనార్హం.

ఈ ఘటనతో తనకు సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు. అనంతరం రోడ్డుపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


More Telugu News