CAG Report: రాష్ట్రాలకు అప్పుల డేంజర్ బెల్స్.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు

CAG Report Reveals States Debt Crisis in India
  • పదేళ్లలో మూడింతలకు పైగా పెరిగిన రాష్ట్రాల అప్పులు
  • రూ.17.57 లక్షల కోట్ల నుంచి రూ.59.60 లక్షల కోట్లకు చేరిన రుణభారం
  • పెట్టుబడులకు బదులు రెవెన్యూ లోటు పూడ్చేందుకే అనేక రాష్ట్రాలు రుణాలు
  • ఈ జాబితాలో ఏపీ సహా 11 రాష్ట్రాలు ఉన్నాయని వెల్లడించిన కాగ్
  • అప్పుల నిష్పత్తిలో పంజాబ్ టాప్.. మెరుగైన స్థానంలో ఒడిశా
  • ఇది కేంద్ర ప్రభుత్వ నిర్బంధ సమాఖ్యవాదమేనన్న కాంగ్రెస్ పార్టీ
దేశంలోని రాష్ట్రాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, గత దశాబ్ద కాలంలో వాటి రుణభారం ఏకంగా మూడింతలు పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తొలిసారి విడుదల చేసిన దశాబ్ద విశ్లేషణ నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

కాగ్ అధిపతి కె. సంజయ్ మూర్తి రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాల మొత్తం అప్పులు రూ.17.57 లక్షల కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి అది రూ.59.60 లక్షల కోట్లకు చేరింది. అంటే పదేళ్లలోనే రాష్ట్రాల అప్పులు 3.3 రెట్లకు పైగా పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాల బడ్జెట్‌లో సింహభాగం వడ్డీలు, రుణాల చెల్లింపులకే సరిపోతోందని పేర్కొంది.

తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనకు, పెట్టుబడులకు కాకుండా రోజువారీ రెవెన్యూ ఖర్చులకు, లోటును పూడ్చుకోవడానికి వాడుతున్నాయని కాగ్ తప్పుబట్టింది. ఆర్థిక నిర్వహణలో పాటించాల్సిన 'గోల్డెన్ రూల్'ను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు ఈ విధంగా రుణాలను పక్కదారి పట్టిస్తున్నాయని పేర్కొంది. ఏపీలో నికర రుణాల్లో కేవలం 26 శాతమే మూలధన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది.

రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)తో పోలిస్తే అప్పుల నిష్పత్తి కూడా ఆందోళనకరంగా పెరుగుతోందని కాగ్ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పంజాబ్ అత్యధికంగా 40.35 శాతం రుణ నిష్పత్తితో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో నాగాలాండ్ (37.15%), పశ్చిమ బెంగాల్ (33.70%) ఉన్నాయి. మరోవైపు ఒడిశా (8.45%), మహారాష్ట్ర (14.64%), గుజరాత్ (16.37%) రాష్ట్రాలు మెరుగైన ఆర్థిక క్రమశిక్షణతో తక్కువ రుణ నిష్పత్తిని నమోదు చేశాయి.

కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
కాగ్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం 'నిర్బంధ సమాఖ్యవాదం'తో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి కేంద్రం దిగజార్చుతోందని విమర్శించారు. జీఎస్టీ సెస్, ఏకపక్ష సుంకాలతో రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతున్నారని, దీనివల్లే అవి అప్పుల పాలవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
CAG Report
State Loans
Indian Economy
Debt Burden
Sanjay Murthy
Fiscal Management
GSDP
Punjab Debt
Andhra Pradesh Finances
Ranadeep Surjewala

More Telugu News