H1B Visa: అమెరికా ఆశలకు గండి.. తెలుగు యువత డాలర్ డ్రీమ్స్‌కు ట్రంప్ బ్రేక్!

Donald Trump H1B visa fee hike hits Telugu youth dreams
  • హెచ్‌1-బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్
  • తెలుగు రాష్ట్రాల యువత అమెరికా కలలపై తీవ్ర ప్రభావం
  • కనీస వేతనం 1.50 లక్షల డాలర్లకు పెంపుతో కంపెనీలకు భారం
  • ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం
  • భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపిస్తున్న ప్రవాస సంఘాలు
అమెరికాలో ఉద్యోగం చేసి డాలర్లు సంపాదించాలనే లక్షలాది మంది భారతీయుల ఆశలపై, ముఖ్యంగా తెలుగు యువత కలలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నీళ్లు చల్లింది. హెచ్‌1-బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

ఇప్పటివరకు అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి హెచ్‌1-బీ వీసాలను ఒక మార్గంగా ఉపయోగించుకునేవి. అయితే, తాజా నిబంధనల ప్రకారం కంపెనీలు కేవలం లక్ష డాలర్ల ఫీజు చెల్లించడమే కాకుండా, ఆ ఉద్యోగికి ఏటా కనీసం 1.50 లక్షల డాలర్ల వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో సగటున లక్ష డాలర్ల వార్షిక వేతనం ఇస్తుండగా, ఇప్పుడు ఫీజుకే అంత మొత్తం చెల్లించాల్సి రావడంతో కంపెనీలు విదేశీయులను నియమించుకోవడానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది. స్థానికులకే ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంటోంది.

ప్రతి ఏటా అమెరికా జారీ చేసే 85 వేల హెచ్‌1-బీ వీసాల్లో సుమారు 73 శాతం, అంటే దాదాపు 62 వేల వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య 35 వేల వరకు ఉంటుందని అంచనా. తాజా నిర్ణయంతో వీరి అమెరికా ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారనుంది.

ఈ ప్రభావం కేవలం ఉద్యోగార్థులపైనే కాకుండా, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విద్యార్థులపైనా పడనుంది. చదువు పూర్తయ్యాక ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ద్వారా ఉద్యోగంలో చేరి, హెచ్‌1-బీ వీసా పొందే మార్గం ఇప్పుడు దాదాపు మూసుకుపోయినట్లేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరమైన విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని, ఇది భారతీయులను పరోక్షంగా లక్ష్యం చేసుకోవడమేనని అక్కడి తెలుగు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
H1B Visa
Donald Trump
H1B visa fee hike
Indian IT professionals
Telugu students USA
US jobs for Indians
America jobs
OPT
US immigration policy
Telugu Association of America

More Telugu News