Indians: అమెరికాలో గందరగోళం.. స్వదేశానికి ప్రయాణాలను రద్దు చేసుకుంటున్న భారతీయులు

Donald Trump H1B Visa Fee Hike Causes Travel Chaos for Indians
  • హెచ్-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సంచలన నిర్ణయం
  • నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన
  • భయంతో స్వదేశానికి ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న ఎన్నారైలు
  • ఇతర దేశాల్లో ఉన్నవారు హుటాహుటిన అమెరికాకు తిరుగు ప్రయాణం
  • భారత్ నుంచి అమెరికాకు విమాన టికెట్ల ధరలకు రెక్కలు
  • హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పెరిగిన రద్దీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం హెచ్-1బీ వీసాదారుల జీవితాలను తలకిందులు చేసింది. హెచ్-1బీ వీసా రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ. 88 లక్షలు) పెంచుతున్నట్లు ఆయన చేసిన ప్రకటనతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కొత్త నిబంధన ఈ రోజు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఆకస్మిక నిర్ణయంతో అమెరికాలోని విమానాశ్రయాల్లో శుక్రవారం నుంచి తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ముఖ్యంగా దసరా, దీపావళి పండుగల కోసం భారత్‌కు రావాలని సిద్ధమైన ఎంతోమంది తమ ప్రయాణాలను వెంటనే రద్దు చేసుకున్నారు. ఇప్పుడు అమెరికా విడిచిపెడితే, తిరిగి రావడానికి లక్ష డాలర్ల భారీ రుసుము చెల్లించాల్సి వస్తుందనే భయంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ వీసాదారులు కొత్త నిబంధన అమల్లోకి రాకముందే అమెరికా చేరుకోవాలని పరుగులు పెడుతున్నారు.

ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఎమిరేట్స్ విమానం ఎక్కిన పలువురు భారతీయ ప్రయాణికులు, ట్రంప్ ప్రకటన గురించి తెలుసుకుని హుటాహుటిన కిందకు దిగిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.

ట్రంప్ నిర్ణయం ప్రభావం విమాన టికెట్ల ధరలపై కూడా తీవ్రంగా పడింది. భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు రూ. 40,000 ఉండే ఎకానమీ క్లాస్ టికెట్ ధర, శనివారం నాటికి రూ. 80,000 దాటిపోయింది. ఇదే పరిస్థితి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించింది. అమెరికా వెళ్లే ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. గడువులోగా అమెరికా చేరుకోవాలన్న ఆత్రుత ప్రయాణికుల్లో స్పష్టంగా కనిపించింది.
Indians
Donald Trump
H-1B visa
US immigration
Indian professionals
Visa fee hike
Travel ban
San Francisco airport
Immigration policy
USA
Indians in America

More Telugu News