ఉద్యోగం కోసం ఇరాన్ వెళుతున్నారా?.. అయితే ఇది తెలుసుకోండి!

  • ఇరాన్‌లో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలపై కేంద్రం హెచ్చరిక
  • ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయులను కిడ్నాప్ చేస్తున్న నేర ముఠాలు
  • బాధితుల కుటుంబ సభ్యుల నుంచి భారీగా డబ్బు డిమాండ్
  • టూరిస్ట్ వీసా ఫ్రీ ఎంట్రీని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లు
  • అపరిచిత ఏజెంట్లు, ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
ఇరాన్‌లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వస్తున్న నకిలీ ఆఫర్ల పట్ల భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి మోసపూరిత హామీలను నమ్మి ఇరాన్‌కు వెళ్లిన కొందరు భారతీయులు కిడ్నాప్‌కు గురవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి రావడంతో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

విదేశీ వ్యవహారాల శాఖ కథనం ప్రకారం, ఇరాన్‌లో మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామని లేదా అక్కడి నుంచి మరో దేశానికి పంపిస్తామని కొందరు ఏజెంట్లు భారతీయులకు ఆశ చూపుతున్నారు. వారి మాటలు నమ్మి ఇరాన్ చేరుకున్న తర్వాత, అక్కడి నేరగాళ్లు వారిని కిడ్నాప్ చేసి బంధిస్తున్నారు. అనంతరం బాధితులను విడిచిపెట్టాలంటే వారి కుటుంబ సభ్యుల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ తరహా కేసులు ఇటీవల పెరిగిపోవడంతో పౌరులను అప్రమత్తం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ మోసాల నేపథ్యంలో భారత పౌరులు గుర్తు తెలియని ఏజెంట్లు ఇచ్చే ఉపాధి ఆఫర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రభుత్వం కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తోందని గుర్తు చేసింది. ఉద్యోగం లేదా ఇతర పనుల కోసం వీసా లేకుండా ఇరాన్‌కు తీసుకెళతామని చెప్పే ఏజెంట్లు నేర ముఠాలతో కుమ్మక్కు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందువల్ల పౌరులు ఇలాంటి మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని తెలిపింది.


More Telugu News