Suryapet: మద్యం మత్తులో ఘోరం.. ఏడుస్తోందని ఏడాది కూతురి ప్రాణాలు తీసిన తండ్రి

Drunk Father Kills Baby Daughter in Suryapet
  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన దారుణ ఘటన
  • మద్యం మత్తులో కన్న కూతురిని చంపేసిన తండ్రి
  • భార్యతో గొడవ పడుతుండగా పాప ఏడవడమే కారణం
  • ఆగ్రహంతో ఏడాది చిన్నారిని నేలకేసి కొట్టిన వైనం   
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పసికందు మృతి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మానవత్వం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి, కన్న కూతురినే కిరాతకంగా హతమార్చాడు. ఏడుపు ఆపడం లేదన్న ఆగ్రహంతో ఏడాది పసికందు ప్రాణాలను బలిగొన్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే... సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకటేశ్‌కు రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడే అలవాటు ఉంది. శుక్రవారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఆయన భార్య, భర్త తీరును నిలదీసింది. వారిద్దరూ వాగ్వాదానికి దిగిన సమయంలో వారి 12 నెలల కూతురు భవిజ్ఞ ఏడుపు మొదలుపెట్టింది.

అప్పటికే మద్యం మత్తులో భార్యపై కోపంతో రగిలిపోతున్న వెంకటేశ్, బిడ్డ ఏడుపుతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు. విచక్షణ కోల్పోయి పసికందు కాళ్లు పట్టుకుని గాల్లోకి విసిరికొట్టాడు. దాంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు పాపను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అయితే, పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు నిందితుడైన తండ్రి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. తాగుడు వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Suryapet
Infanticide
Venkatesh
Drunken father
Child death
Crime news
Telangana news
Alcohol abuse
Bhuvigna

More Telugu News