Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఛాంబర్ లో క్యాబినెట్ భేటీ... నాలా ఫీజు రద్దుకు ఆమోదం

Chandrababu Cabinet Approves Nala Fee Cancellation
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
  • నాలా ఫీజు రద్దు చట్ట సవరణకు ఆమోదం
  • వాహనమిత్ర కింద రూ.15 వేల సాయానికి గ్రీన్ సిగ్నల్
  • అసెంబ్లీలో ప్రవేశపెట్టే 13 బిల్లులకు ఆమోదముద్ర
  • భారీ ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు
  • ఏపీ జీఎస్టీ బిల్లు 2025 సవరణలకు కేబినెట్ ఓకే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో ప్రజలకు లబ్ధి చేకూర్చే పలు ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో ప్రధానంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చేటప్పుడు విధించే నాలా (వ్యవసాయేతర భూముల మదింపు) ఫీజును రద్దు చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలను రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియాకు వెల్లడించారు. వాహనమిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని ఆమె తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల వేగవంతమైన అమలు కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి కూడా కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు వీలుగా మొత్తం 13 బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని హోంమంత్రి వివరించారు. వీటిలో ఏపీ జీఎస్టీ బిల్లు 2025కు సంబంధించిన సవరణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించినట్లు ఆమె తెలిపారు. ఈ నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh cabinet meeting
Nala fee abolition
Agricultural land conversion
Vahana Mitra scheme
Auto taxi drivers financial assistance
Special Purpose Vehicle SPV
AP GST Bill 2025
Voter list preparation

More Telugu News