ఏఐతో ట్రిలియన్ల డాలర్ల సంపద.. 90 శాతం ఉద్యోగాలపై ప్రభావం!

  • ఏఐ ప్రభావంపై ప్రముఖ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సంచలన నివేదిక
  • కొన్ని ఉద్యోగాలు పోయినా, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని స్పష్టం
  • రిటైల్, రియల్ ఎస్టేట్, రవాణా రంగాల్లో భారీ మార్పులకు అవకాశం
  • ఎస్అండ్‌పీ 500 కంపెనీలకు ఏటా 920 బిలియన్ డాలర్ల నికర లాభం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, ఉద్యోగ రంగాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టనుందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఏఐ వాడకం వల్ల ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ల డాలర్ల ప్రయోజనం చేకూరనుండగా, దాదాపు 90 శాతం ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోతాయని అంచనా వేసింది.

మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం ప్రకారం ఎస్అండ్‌పీ 500 సూచీ(అమెరికా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన 500 కంపెనీలు) లోని కంపెనీలు పూర్తిస్థాయిలో ఏఐని వినియోగిస్తే ఏటా సుమారు 920 బిలియన్ డాలర్ల నికర ప్రయోజనం పొందవచ్చు. ఇందులో అధిక భాగం, అంటే 490 బిలియన్ డాలర్లు మానవ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తిచేసే ‘ఏజెటిక్ ఏఐ’ సాఫ్ట్‌వేర్ల ద్వారా సమకూరుతుందని పేర్కొంది. మిగిలిన 430 బిలియన్ డాలర్లు హ్యూమనాయిడ్ రోబోల వంటి ‘ఎంబాడీడ్ ఏఐ’ ద్వారా లభిస్తుందని వివరించింది. ఈ ఉత్పాదకత విప్లవం దీర్ఘకాలంలో ఎస్అండ్‌పీ 500 మార్కెట్ విలువను ఏకంగా 13 నుంచి 16 ట్రిలియన్ డాలర్ల మేర పెంచగలదని అంచనా వేసింది.

ఉద్యోగాల భవిష్యత్తుపై ఈ నివేదిక ఆసక్తికరమైన విశ్లేషణను అందించింది. ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనల నడుమ, సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించింది. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేషన్ పరిధిలోకి వెళ్లినా, అనేక కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపింది. ఈ అంశంపై మోర్గాన్ స్టాన్లీ అమెరికా ఆర్థికవేత్త హీథర్ బెర్గర్ మాట్లాడుతూ "కొన్ని ఉద్యోగాలు ఆటోమేషన్ బారిన పడినా, ఏఐ సాయంతో మరికొన్ని ఉద్యోగాల సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు, ఏఐ పూర్తిగా కొత్త తరహా ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది" అని వివరించారు.

ప్రధానంగా మూడు రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని మోర్గాన్ స్టాన్లీ గుర్తించింది. రిటైల్, వినియోగ వస్తువుల పంపిణీ, రియల్ ఎస్టేట్ నిర్వహణ, రవాణా రంగాలపై దీని ప్రభావం అధికంగా ఉండనుంది. రిటైల్‌లో సప్లై-చైన్ నిర్వహణ నుంచి మొదలుకొని, రియల్ ఎస్టేట్‌లో హ్యూమనాయిడ్ రోబోల సహాయం, రవాణాలో అటానమస్ డెలివరీ వ్యవస్థల వరకు ఏఐ వినియోగం గణనీయంగా పెరగనుందని నివేదిక పేర్కొంది.


More Telugu News