Chandrababu Naidu: ప్రతిపక్ష హోదా అడుగుతున్న పార్టీ సంస్కరణలను స్వాగతించలేని దుస్థితిలో ఉంది: సీఎం చంద్రబాబు

Chandrababu Says Opposition Cant Welcome Reforms While Asking for Opposition Status
  • కేంద్రం తెచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలకు ఏపీ శాసనసభ ఆమోదం
  • ఈ తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్
  • భారీగా తగ్గనున్న నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు
  • సంస్కరణల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహనకు మంత్రివర్గ ఉపసంఘం
  • కొన్ని పార్టీలు మంచిని అర్థం చేసుకోలేవంటూ ప్రతిపక్షంపై సీఎం విమర్శలు
  • దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని మోదీకి, నిర్మలకు సభ అభినందనలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్కరణలను స్వాగతిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో, దేశంలోనే జీఎస్టీ 2.0ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తాయని, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వన్ నేషన్-వన్ విజన్ ఇదే మా నినాదం అని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో నిలవాలి, దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి. ఈ లక్ష్య సాధనకు కేంద్రం తెచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయి" అని స్పష్టం చేశారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభకు సమగ్రంగా వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరళతరం చేసే దిశగా చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శాసనసభ తరఫున ఆయన అభినందనలు తెలిపారు.

కొన్ని పార్టీల వైఖరిపై విమర్శలు

ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల వైఖరిని ఆయన తప్పుబట్టారు. "చరిత్రలో నిలిచిపోయే ఇలాంటి మంచి సంస్కరణలను కొన్ని పార్టీలు అర్థం చేసుకోలేవు, వాటికి సహకరించవు. కనీసం ప్రతిపక్ష హోదా అడుగుతున్న పార్టీ కూడా ఈ సంస్కరణలను స్వాగతించలేని దుస్థితిలో ఉండటం బాధాకరం" అని ఆయన విమర్శించారు. అసెంబ్లీ అనేది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును నిర్దేశించే దేవాలయమని, ప్రజా సమస్యలపై చర్చించి, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి సభ్యులందరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

"కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం అసెంబ్లీలో గడపాలి. మంత్రులు, అధికారులు బాధ్యతగా శాసనసభలో ఉండాలి. అసెంబ్లీ 175 మంది ఎమ్మెల్యేల కోసం మాత్రమే కాదు... 5 కోట్ల మంది ప్రజల కోసం. వారి భవిష్యత్ కోసం అసెంబ్లీ ఏర్పాటైంది. అసెంబ్లీ అనే దేవాలయంలో ప్రజాహితం కోసం చేసే నిర్ణయాలు జరుగుతాయి. ప్రజల జీవితాల్లో మార్పుల కోసం మనం అంతా కూర్చుని చర్చించాలి. దేశాన్ని, భవిష్యత్ తరాన్ని ముందుకు నడిపించగలిగిన సంస్కరణ ఇది” అని చంద్రబాబు అన్నారు.

ప్రజలకు మేలు జరుగుతుందనేదే సీఎం ఆలోచన: పయ్యావుల

ఇక అసెంబ్లీలో మరో తీర్మానాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జీఎస్టీ రెండో తరం సంస్కరణలకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రిని సభ అభినందించింది. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ఆదాయం కొంత మేర తగ్గుతున్నా... విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబే తొలిసారిగా ఈ సంస్కరణలను ఆమోదించారని పయ్యావుల తెలిపారు. రాష్ట్రానికి ఆదాయం తగ్గినా, ప్రజలకు లబ్ది చేకూరుతుందనేదే ముఖ్యమంత్రి ఆలోచన అని చెప్పారు. రూ. 8 వేల కోట్లు నష్టం వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళితే... ప్రజలకు రూ. 8 వేల కోట్ల లబ్ది చేకూరుతుంది కదా అని సీఎం అన్నారని పయ్యావుల గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమాన్ని, ఆర్థిక సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలను సీఎం మద్దతు తెలిపారన్నారు. జీఎస్టీ సంస్కరణలకు చంద్రబాబు మద్దతిచ్చారని తెలియగానే... జీఎస్టీ సంస్కరణలపై అందరిలోనూ ఓ పాజిటివ్ దృక్కోణం ఏర్పడిందని పయ్యావుల వివరించారు.

Chandrababu Naidu
Andhra Pradesh
GST 2.0
Payyavula Keshav
Narendra Modi
Nirmala Sitharaman
AP Assembly
Economic Reforms
One Nation One Vision
Telugu News

More Telugu News