Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపిక ఔట్.. షాకింగ్ ప్రకటన చేసిన వైజయంతి మూవీస్

Deepika Padukone Out of Kalki 2 Vyjayanthi Movies Announces
  • 'కల్కి 2'లో దీపిక నటించడం లేదని వైజయంతి మూవీస్ ప్రకటన
  • దీపికతో అనుసంధానం కుదరలేదని వెల్లడి
  • మొదటి భాగంలో సుమతి పాత్రతో ఆకట్టుకున్న దీపిక
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం సీక్వెల్‌పై చిత్ర బృందం ఓ కీలక ప్రకటన చేసింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించడం లేదని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా వెల్లడించింది. పార్ట్ 2 కథకు ఆమె పాత్రే కీలకం కానున్న తరుణంలో వెలువడిన ఈ వార్త అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ మేరకు వైజయంతి మూవీస్ తమ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో దీపికా పదుకొణె భాగస్వామ్యం ఉండబోదని వారు స్పష్టం చేశారు. "మొదటి భాగం నిర్మాణంలో సుదీర్ఘకాలం కలిసి ప్రయాణం చేసినప్పటికీ, ఈ భాగస్వామ్యంలో అవసరమైన అనుసంధానం కుదరలేదు. ఇంతటి భారీ ప్రాజెక్టుకు సంపూర్ణ నిబద్ధత చాలా అవసరం, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తమ ప్రకటనలో పేర్కొన్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ' 2024 జూన్ 27న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'సుమతి' అనే కీలక పాత్రలో దీపిక నటించారు. గర్భవతిగా ఉన్నప్పటికీ షూటింగ్‌లో పాల్గొని తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కథానుసారం, రెండో భాగంలో సుమతి పాత్రే అత్యంత ప్రధానమైనది. అలాంటి సమయంలో ఆమె ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించారు. మొదటి భాగం విజయం తర్వాత రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు దీపికా స్థానంలో సుమతి పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
Deepika Padukone
Kalki 2898 AD
Kalki 2
Vyjayanthi Movies
Prabhas
Nag Ashwin
Indian Cinema
Bollywood
Telugu Cinema
Science Fiction Film

More Telugu News