Disha Patani: నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. ఇద్దరు నిందితుల ఎన్‌కౌంటర్

Disha Patani House Shooting Two Accused Encountered
  • ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో గల దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల కలకలం
  • యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చిన మరుసటి రోజే ఎన్‌కౌంటర్
  • నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు
బాలీవుడ్ నటి దిశా పటానీ నివాసం వద్ద ఇటీవల జరిగిన కాల్పుల ఘటన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల కలకలం రేపిన విషయం విదితమే.

కాల్పులకు పాల్పడిన వారిని ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. వారిని రవీంద్ర, అరుణ్‌లుగా పోలీసులు గుర్తించారు. వారు రోహిత్ గోదారా - గోల్డీ బ్రార్ ముఠా సభ్యులని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి తుపాకులు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దిశా సోదరి ఖుష్బూ పటానీ ఒక వర్గం మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఈ కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించుకుంది. ఖుష్బూ పటానీ మాజీ ఆర్మీ అధికారిణి, ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు దిశ తండ్రి మీడియాకు తెలిపారు.
Disha Patani
Disha Patani shooting
Khushboo Patani
Goldy Brar gang
Rohit Godara
Bareilly
Encounter

More Telugu News