Chandrababu Naidu: ఈ విషయంలో మాతో ఎవరూ పోటీ పడలేరు: సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Says No One Can Compete With AP in Speed of Business
  • వచ్చే నెలలోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు
  • 2026 ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధం
  • పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్న సీఎం
  • ఏపీలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం అధికారంలో ఉందని స్పష్టం చేసిన చంద్రబాబు
  • ప్రధాని మోదీ దేశానికి పెద్ద ఆస్తి అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి
  • డబుల్ ఇంజన్ సర్కార్‌తో రెండంకెల వృద్ధి సాధిస్తామని ధీమా
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం అధికారంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాత్రమే కాదని, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో తమతో ఎవరూ పోటీ పడలేరని ఆయన పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో బుధవారం జరిగిన సీఐఐ-గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ నివేదికను ఆవిష్కరించిన అనంతరం సీఎం కీలక ప్రకటనలు చేశారు.

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా, విశాఖ కేంద్రంగా కీలక పరిణామాలు జరగనున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థ గూగుల్‌కు చెందిన డేటా సెంటర్‌ను వచ్చే నెలలోనే విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టు నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం స్పష్టం చేశారు.  అమరావతిలోనూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

ఏపీలో ఉన్న సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి అన్నారు. దీని కోసం ఏపీలో లాజిస్టిక్స్ రంగంపై దృష్టి పెట్టామని పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైల్వేలను సమన్వయం చేస్తూ రవాణా వ్యయాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వ

విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడపతో పాటు ఓర్వకల్లు, పుట్టపర్తి లాంటి చోట్ల విమానాశ్రయాలు రాష్ట్రాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయని స్పష్టం చేశారు. త్వరలో అమరావతిలోనూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. హైదరాబాద్-అమరావతి-చెన్నైలను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా వస్తుందన్నారు. అమరావతి నగరాన్ని గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని.., విజయవాడ-గుంటూరులను అనుసంధానిస్తున్నట్టు తెలిపారు.  

టెక్నాలజీ పరంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నట్టు వివరించారు. అలాగే డేటా లేక్ ద్వారా ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నామని స్పష్టం చేశారు. వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌర సేవలను అందిస్తున్నామని వివరించారు. సేవల నాణ్యత కోసం  ప్రైవేటు కంపెనీల తరహాలోనే ఈ సేవలకు రేటింగ్ కూడా కోరుతున్నామని అన్నారు. అలాగే జీఎస్టీ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు ఓ గేమ్ చేంజర్ గా మారనున్నాయని వివరించారు.

ప్రధాని మోదీ దేశానికి పెద్ద ఆస్తి

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్‌తో రెండంకెల వృద్ధిని సాధించి తీరుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని, ఆయన దేశానికి అతిపెద్ద ఆస్తి అని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2028 నాటికే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అన్నారు. దీనికి అనుగుణంగానే, 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఒక స్పష్టమైన విజన్‌ను రూపొందించామని వివరించారు. ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ నినాదంతో ప్రతి కుటుంబంలో ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

గత ఐదేళ్లలో రాష్ట్రం నష్టపోయింది

2019-24 మధ్య కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన లోపాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నో సువర్ణావకాశాలను కోల్పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత ఎదురైన సవాళ్లను తాము గతంలో అధిగమించామని, అయితే గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రగతి వెనక్కి వెళ్లిందని అన్నారు. ప్రస్తుతం ఏపీలో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చే ప్రభుత్వం ఉందని, పెట్టుబడులకు ఎలాంటి ఢోకా లేదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసి, రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా పరిశ్రమలకు మరింత అనుకూల వాతావరణం కల్పిస్తామని వెల్లడించారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP Industries
CII Summit
Vizag
Bhogapuram Airport
Google Data Center
Ease of Doing Business
Nirmala Sitharaman
AP Economy

More Telugu News