అమరావతిలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

  • అమరావతి పరిధిలో 10 ప్రభుత్వ పాఠశాలల దత్తత
  • ‘టీచ్ ఫర్ చేంజ్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమం
  • ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనూ సేవలు
నటి, నిర్మాత మంచు లక్ష్మి తన సేవా కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించారు. ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా తాజాగా అమరావతి పరిధిలోని పది ప్రభుత్వ పాఠశాలలను ఆమె దత్తత తీసుకున్నారు. 

ఇటీవల తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో పది పాఠశాలలను దత్తత తీసుకున్నామని గుర్తుచేసిన మంచు లక్ష్మి, ఇప్పుడు అమరావతిలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తమ సంస్థతో పాటు మరికొందరు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. దత్తత తీసుకున్న పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. “పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే మా లక్ష్యం. పాఠశాలలకు ఏం కావాలో అవన్నీ మేం సమకూరుస్తాం” అని ఆమె పేర్కొన్నారు.

తమ సేవలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని, ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామని మంచు లక్ష్మి తెలిపారు. విద్యారంగంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘టీచ్ ఫర్ చేంజ్’ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. కాగా, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ‘దక్ష’ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


More Telugu News