తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

  • రాజకీయ పార్టీ పెడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • నేడు హైదరాబాద్‌లో అధికారికంగా ప్రకటించనున్న వైనం
  • బీసీల ఆత్మగౌరవమే తమ పార్టీ అజెండా అని వెల్లడి
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక దినమైన సెప్టెంబర్ 17న పార్టీని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడు వెలువడనుంది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలను ఆయన ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, "తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోంది" అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏ పార్టీ బీసీలను ఎలా వంచించిందో లెక్కలతో వివరిస్తానని ఆయన పేర్కొన్నారు.

సెప్టెంబర్ 17వ తేదీని ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. కొందరు ఈ రోజును విమోచన దినమని, మరికొందరు విద్రోహ దినమని అంటున్నారని, కానీ వాస్తవానికి ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజని ఆయన గుర్తుచేశారు. అందుకే ఈ చారిత్రక రోజున తమ పార్టీని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి పూర్తి వివరాలు నేటి సమావేశంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. 


More Telugu News