అక్రమ ఆస్తుల కేసులో ఏడీఈ అంబేద్కర్‌కు రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

  • ఏడీఈ అంబేద్కర్ ను ఉదయం కోర్టులో హాజరు పరిచిన ఏసీబీ అధికారులు
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • అంబేద్కర్ బినామీ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో అరెస్టయిన తెలంగాణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) అంబేద్కర్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయన్ను అరెస్ట్ చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, ఈ ఉదయం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మాదాపూర్, గచ్చిబౌలి సహా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఏడీఈ అంబేద్కర్, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై 15 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు.

ముఖ్యంగా అంబేద్కర్ బినామీగా అనుమానిస్తున్న సతీశ్ నివాసంలో ఏకంగా రూ.2 కోట్ల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూమి, వెయ్యి గజాల విస్తీర్ణంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌ను కూడా గుర్తించినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అంబేద్కర్‌ను కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు త్వరలోనే పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 


More Telugu News