నెహ్రూ ఒక భూస్వామి.. ఆయన వల్లే దేశం వెనకబడింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

  • భారత తొలి ప్రధాని నెహ్రూపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
  • నెహ్రూది ఫ్యూడల్ మనస్తత్వం అని వ్యాఖ్య
  • సింగపూర్‌తో భారత్ పోటీ పడలేకపోవడానికి ఆయనే కారణమన్న సీఎం
  • 1991 ఆర్థిక సంస్కరణల తర్వాతే దేశం పురోగమించిందని వెల్లడి
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఒక భూస్వామి (ఫ్యూడల్) అని, ఆయన అనుసరించిన సోషలిస్టు విధానాల కారణంగానే స్వాతంత్య్రానంతరం దేశం అభివృద్ధిలో వెనకబడిపోయిందని విమర్శించారు. సింగపూర్ వంటి దేశాలతో భారత్ పోటీ పడలేకపోవడానికి నెహ్రూ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా సింగపూర్ అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించారు. "భారత్‌కు, సింగపూర్‌కు కొన్నేళ్ల తేడాలోనే స్వాతంత్య్రం వచ్చింది. సింగపూర్ నేత లీ కాన్ యూ పోటీతత్వ ఆర్థిక విధానాలను అమలు చేసి ఆ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. కానీ మన దేశంలో తొలి ప్రధాని అయిన నెహ్రూ ఒక భూస్వామి. ఆయనకు అపారమైన సంపద ఉండేది" అని చంద్రబాబు పేర్కొన్నారు.

నెహ్రూ జీవనశైలిని ఉదహరిస్తూ "లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఆయన ఏ గేటు దగ్గరికి వెళ్తే ఆ గేటు దగ్గరికే కారు వచ్చేసేది. అలాంటి నేపథ్యం ఉన్న ఆయన అనుసరించిన సోషలిస్టు విధానాల వల్ల 1947 నుంచి 1991 వరకు దేశం స్తంభించిపోయింది. సింగపూర్‌తో ఏమాత్రం పోటీ పడలేకపోయాం" అని చంద్రబాబు వివరించారు. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాతే భారతదేశం మళ్లీ అభివృద్ధి బాట పట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News