నార్సింగ్‌ లంచం కేసు: డబ్బులు కమిషనర్‌కూ వెళ్తాయి.. మణిహారిక ఆడియో కలకలం!

  • నార్సింగ్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్
  •  ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ కోసం మొదట రూ.10 లక్షల డిమాండ్
  •  లంచం డబ్బులో కమిషనర్‌కూ వాటా ఉందని అధికారిణి వెల్లడి
  •  బాధితుడితో అధికారిణి సంభాషణను రికార్డ్ చేసిన ఏసీబీ
  •  కోర్టుకు డిజిటల్ ఆధారాలు సమర్పించిన అధికారులు
  •  లీగల్ అడ్వైజర్, కంప్యూటర్ ఆపరేటర్‌ పాత్రపైనా విచారణ
హైదరాబాద్ శివారు నార్సింగ్‌ మునిసిపాలిటీలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సాక మణిహారిక లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను తీసుకున్న లంచం డబ్బులో మునిసిపల్ కమిషనర్‌కు కూడా వాటా ఉందని ఆమె చెప్పిన మాటలు రికార్డు కావడంతో ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ సంభాషణకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కోర్టుకు సమర్పించారు.

మంచిరేవుల గ్రామంలో వెయ్యి గజాల స్థలానికి సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఓ వ్యక్తి ప్రభుత్వానికి రూ. 6,65,002 ఫీజు చెల్లించారు. అయితే, ఫైల్ క్లియరెన్స్ కోసం లంచం ఇవ్వాల్సిందేనని మణిహారిక పట్టుబట్టారు. మలక్‌పేటలో ఉండే మునిసిపల్ లీగల్ అడ్వైజర్ లక్ష్మణ్‌ను కలవాలని ఆమె బాధితుడికి సూచించారు. బాధితుడు లక్ష్మణ్‌ను సంప్రదించగా ఫైల్ ముందుకు కదలాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంతో విసిగిపోయిన బాధితుడు నేరుగా ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బాధితుడికి ఒక సీక్రెట్ కెమెరా ఇచ్చి పంపారు. బాధితుడు మరోసారి మణిహారికను కలిసి రూ.10 లక్షలు ఇవ్వలేనని, తగ్గించాలని కోరాడు. దీంతో ఆమె తనకు రూ.4 లక్షలు, లీగల్ అడ్వైజర్ లక్ష్మణ్‌కు రూ.50 వేలు ఇవ్వాలని చెప్పారు. ఈ డబ్బును తానొక్కదాన్నే తీసుకోవడం లేదని, మునిసిపల్ కమిషనర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కూడా వాటాలు వెళ్తాయని మణిహారిక బాధితుడితో చెప్పినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఆ తర్వాత బాధితుడు రూ.4 లక్షలు మణిహారికకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో లీగల్ అడ్వైజర్ లక్ష్మణ్‌దే కీలకపాత్ర అని ఏసీబీ పేర్కొంది. కమిషనర్, కంప్యూటర్ ఆపరేటర్ మధు ప్రమేయంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఏసీబీ తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది.


More Telugu News