ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు బ్రదర్.. 'లిటిల్ హార్ట్స్' టీమ్‌కి మహేశ్ బాబు స్పెషల్ సర్‌ప్రైజ్!

  • చిన్న సినిమా 'లిటిల్ హార్ట్స్'పై మహేశ్ బాబు ప్రశంసల వర్షం
  • సినిమా చాలా కొత్తగా, అద్భుతంగా ఉందన్న సూపర్ స్టార్
  • మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్‌కు ప్రత్యేకంగా అభినందనలు
  • ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దంటూ సింజిత్‌కు మహేశ్‌ సరదా సూచన
  • సూపర్ స్టార్ ట్వీట్‌తో గాల్లో తేలిపోతున్న చిత్ర బృందం
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న `లిటిల్ హార్ట్స్` చిత్ర బృందానికి సూపర్ స్టార్ మహేశ్‌ బాబు నుంచి ఊహించని ప్రశంసలు అందాయి. సినిమా విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ముఖ్యంగా చిత్ర సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

'లిటిల్ హార్ట్స్' సంగీత దర్శకుడు సింజిత్, మహేశ్‌ బాబుకు వీరాభిమాని. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో, "నా దేవుడు మహేశ్‌ అన్న మా సినిమాపై ఒక్క ట్వీట్ చేస్తే చాలు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతాను" అని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విషయం మహేశ్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తన అభిమానిని నిరాశపరచలేదు. `లిటిల్ హార్ట్స్` సినిమాపై ప్రత్యేకంగా రివ్యూ ఇస్తూ, "సినిమా చాలా సరదాగా, కొత్తగా, అద్భుతంగా ఉంది. నటీనటులందరూ అసాధారణంగా నటించారు" అని కొనియాడారు.

ఇదే పోస్టులో సింజిత్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, "సింజిత్, ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్. నీకు ముందు చాలా బిజీ రోజులు వస్తాయి. రాకింగ్ చేస్తూ ఉండాలి. మొత్తం టీంకి నా అభినందనలు" అని సూపర్ స్టార్ పేర్కొన్నారు. ఎప్పుడూ లేని విధంగా తన పోస్టులో లవ్, స్మైలీ ఎమోజీలను జోడించడం విశేషం. ఇక‌, తన అభిమాన హీరో నుంచి వచ్చిన ఈ స్పందనతో సింజిత్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. "నేను ఎక్కడికీ వెళ్లను మహేశ్‌ అన్నా" అని బదులిస్తూ, 'గుంటూరు కారం'లోని పాటకు మహేశ్‌ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ కూడా, "థ్యాంక్స్ సార్. ఇది ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కాగా, కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'లిటిల్ హార్ట్స్' కేవలం 10 రోజుల్లోనే రూ.32 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వంటి పలువురు స్టార్ హీరోలు ప్రశంసించగా, తాజాగా మహేశ్‌ బాబు ప్రశంసలతో సినిమాకు మరింత ప్రచారం లభించినట్లయింది.


More Telugu News