శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వర విగ్రహం ఎలా అవుతుంది?: భూమన

  • అలిపిరి విగ్రహంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు
  • అది శనీశ్వరుడిది కాదు, శ్రీమహావిష్ణువు విగ్రహమేనని స్పష్టీకరణ
  • శంఖు చక్రాలున్నది శని విగ్రహం ఎలా అవుతుందని సూటి ప్రశ్న
  • అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతోందని తీవ్ర ఆరోపణ
  • నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విమర్శలు
  • తప్పుడు కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని వెల్లడి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, అలిపిరి వద్ద కనిపించిన విగ్రహంపై ఇప్పటికే సంచలన ఆరోపణలు చేశారు. మహావిష్ణువు విగ్రహానికి ఘోర అపచారం జరిగిందంటూ ప్రభుత్వంపైనా, టీటీడీపైనా మండిపడ్డారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి... అది విష్ణుమూర్తి విగ్రహం కాదని, శనీశ్వరుడి విగ్రహం అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో భూమన మరోసారి స్పందించారు. అది శనీశ్వరుడి విగ్రహం కాదని, అది ముమ్మాటికీ శ్రీమహావిష్ణువు విగ్రహమేనని స్పష్టం చేశారు. 

"వైఖానస ఆగమ శాస్త్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు. అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతోందని చెబితే తప్పుడు కేసు పెడతామని హెచ్చరిస్తున్నారు. అది శనీశ్వర విగ్రహం అని చెబుతున్నారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వర విగ్రహం ఎలా  అవుతుంది? శనీశ్వరుడి విగ్రహానికి విల్లు, బాణం ఉంటాయా? అది శిల్పి చెక్కి నిరక్ష్యంగా పడేశారని సమాధానం చెబుతున్నారు. చాలా స్పష్టంగా చెబుతున్నా... అది శ్రీమహావిష్ణువు విగ్రహమే! నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. నాపై తప్పుడు కేసు పెట్టి, జైల్లో వేసినా నేను చెబుతూనే ఉంటా!

నేను నాయకుడ్ని కాదు... స్వచ్ఛమైన హిందువును, హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని, నాపై ఎన్నిసార్లు దుష్ప్రచారం చేసినా ఎవ్వరూ నమ్మరు. స్వామి అనుగ్రహించారు కాబట్టే రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా, మూడు సార్లు బోర్డు సభ్యునిగా అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే స్వామి అనుగ్రహంతో బోర్డు సభ్యులు అయ్యామని చెప్పే మీరు... ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారు? ఇది ముమ్మాటికి ఆ మహావిష్ణువు విగ్రహమే... నాపై ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది లేదు. రాజకీయాల కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం" అని భూమన స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు.


More Telugu News