షేక్ హ్యాండ్ వివాదం: పాకిస్థాన్ ముందు రెండే దారులు... ఒకటి ఎంచుకుంటే టోర్నీ నుంచి ఔట్!

  • ఐసీసీకి పీసీబీ విజ్ఞప్తి 
  • మ్యాచ్ రిఫరీని తొలగించేందుకు ఐసీసీ నిరాకరణ
  • యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాక్ హెచ్చరిక
  • అదే జరిగితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమణ
  • పాక్ అధికారి తప్పిదం వల్లే వివాదం అని గుర్తించిన పీసీబీ
  • క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌పై పీసీబీ వేటు
ఆసియా కప్ 2025లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెగ్గలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తొలగించాలంటూ పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అసలు ఈ వివాదానికి కారణం తమ సొంత అధికారి తప్పిదమేనని తేలడంతో పీసీబీ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది. ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన పీసీబీ ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ కూడా అయిన మోహ్సిన్ నఖ్వీ... తమ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఉస్మాన్ వల్హాను సోమవారం పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ముందు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. 

ఐసీసీ దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పుడు ఒకరకమైన సందిగ్ధంలో పడింది. ఐసీసీ తీసుకున్న కఠిన నిర్ణయంతో, వారి ముందు ఇప్పుడు రెండే దారులు మిగిలాయి. ఒకటి ఎంచుకుంటే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది, మరొకటి ఎంచుకుంటే ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టి ఆటపై దృష్టి పెట్టాలి.

పాకిస్థాన్ బెదిరించినట్లుగా, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించనందుకు నిరసనగా యూఏఈతో జరగబోయే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తే, వారు టోర్నమెంట్ నుంచి తక్షణమే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సూపర్ 4 దశకు అర్హత సాధించే అవకాశం ఉన్నందున, బాయ్‌కాట్ నిర్ణయం వారికి తీవ్ర నష్టం చేస్తుంది. యూఏఈకి 2 పాయింట్లు దక్కి, పాకిస్థాన్ ఇంటి ముఖం పడుతుంది.

ఇక రెండో మార్గం ఏమిటంటే, ఈ వివాదాన్ని పక్కనపెట్టి తమ ఆటపై పూర్తి దృష్టి సారించడం. ఇప్పటికే ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన పాక్ జట్టు, తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివాదాలకు బదులు, యూఏఈపై గెలిచి సూపర్ 4లో స్థానం సంపాదించడంపై దృష్టి పెట్టడమే సరైన మార్గమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

అసలు ఈ వివాదానికి మూలం భారత్‌తో మ్యాచ్ సందర్భంగా జరిగిన 'నో హ్యాండ్‌షేక్' విధానం. ఈ నియమం గురించి పాక్ కెప్టెన్‌కు తెలియకపోవడంతో మైదానంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీనికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కారణమని ఆరోపిస్తూ, అతడిని టోర్నీ నుంచి తొలగించాలని పీసీబీ ఐసీసీని కోరింది. అయితే, ఈ అభ్యర్థనను ఐసీసీ సోమవారం అధికారికంగా తోసిపుచ్చింది.

పీటీఐ నివేదిక ప్రకారం, ఈ గందరగోళానికి అసలు కారణం పీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఉస్మాన్ వల్హా అని తేలింది. 'నో హ్యాండ్‌షేక్' నియమం గురించి కెప్టెన్‌కు తెలియజేయాల్సిన బాధ్యత అతనిదే అయినప్పటికీ, ఆ పని చేయడంలో విఫలమయ్యాడు. దీంతో తమ జట్టు పరువు పోయిందని భావించిన పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఉస్మాన్ వల్హాను పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనా, సొంత అధికారి తప్పిదం వల్ల మొదలైన ఈ వివాదం ఇప్పుడు పాకిస్థాన్‌ను ఇరకాటంలో పడేసింది.


More Telugu News