Rajinikanth: రజనీని సూపర్ స్టార్ ని చేసిన అవమానం అది!

Rajanikanth Special
  • రజనీకి అడ్వాన్స్ ఇవ్వని నిర్మాత 
  • కారు ఇవ్వకుండా అవమానించిన తీరు 
  • కసితో పనిచేస్తూ వెళ్లిన రజనీ 
  • మూడేళ్లలో 36 సినిమాలలో నటించిన హీరో

జీవితంలో ఎవరెస్టు స్థాయికి ఎదిగిన ఎవరిని చూసినా, ఆ స్థాయికి వాళ్లు చేరుకోవడం వెనుక వారి పట్టుదల కనిపిస్తుంది. అహర్నిశలు కష్టపడుతూ వాళ్లు చేసిన కృషి కనిపిస్తుంది. అయితే వాళ్ల కసి వెనుక .. కృషి వెనుక మాత్రం, వాళ్లను బాగా బాధించిన అవమానం కనిపిస్తుంది. అవమానాన్నే అభివృద్ధికి తొలి మెట్టుగా చేసుకుని ముందుకు సాగిపోయిన వాళ్లు మాత్రమే అగ్రస్థానానికి చేరుకుంటారు. అలాంటివారిలో ఒకరిగా రజనీకాంత్ కనిపిస్తారు. 

రజనీకాంత్ .. కొన్ని దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న మహారాజు. ఎంతోమంది హీరోలు ఆ తరువాత కాలంలో వచ్చారు .. ఎన్నో విజయాలను అందుకుంటూ వెళుతున్నారు. అయినా రజనీ క్రేజ్ గానీ .. మార్కెట్ గాని తగ్గింది లేదు. ఒక హీరో వయసుతో పాటు క్రేజ్ .. మార్కెట్ కూడా పెరుగుతూ పోవడమనేది ఒక్క రజనీ విషయంలో మాత్రమే జరిగిందేమో అనిపిస్తుంది. అలాంటి రజనీకి ఎదురైన ఒక అవమానమే ఆయనను సూపర్ స్టార్ ను చేసిందని అంటారు. 

రజనీ హీరోగా ఎదుగుతున్న రోజులవి. ఆర్ధికంగా ఇంకా ఆయన నిలదొక్కుకోలేదు. ఒక కొత్త సినిమా షూటింగు తొలి రోజున ప్రొడక్షన్ వాళ్లు పంపిన కారులో రజనీ ఒక స్టూడియోకి వెళ్లారట. ఆ రోజున రజనీకి కొంత అడ్వాన్స్ ఇవ్వమని నిర్మాతతో దర్శకుడు చెప్పాడు. దాంతో ఆ నిర్మాతకి కోపం వచ్చేసింది. 'ఆయనేమైనా సూపర్ స్టారా? ముందు సినిమా చేయమను .. ఆ తరువాత ఇద్దాం' అన్నాడట ఆ నిర్మాత. దాంతో రజనీకి కోపం వచ్చేసి, 'సార్ నేను ఈ సినిమా చేయడం లేదు' అని లేచి నుంచున్నారు. 

'చేయకపోతే పోవయ్యా ..' అని ఆ నిర్మాత అనడంతో, 'అయితే ఎలా తీసుకొచ్చారో అలాగే నన్ను డ్రాప్ చేయమని చెప్పండి' అని రజనీ అన్నారట.  అలా కారులో పంపించడం కుదరదు అని ఆ నిర్మాత అనడంతో, రజనీ అక్కడి నుంచి వెనుదిరిగాడట. తాను కారు కొనాలనీ ..  సూపర్ స్టార్ ను అనిపించుకోవాలని ఆ రోజునే రజనీ బలంగా నిర్ణయించుకున్నారట. ఆ కసితోనే ఆయన మూడేళ్లలో 36 సినిమాలు చేశారని, సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్రరావు, 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 

Rajinikanth
Superstar Rajinikanth
Rajinikanth insult
Nandam Harishchandra Rao
Rajinikanth movies
Tamil cinema
Tollywood news
Rajinikanth success story
Rajinikanth early life
Rajinikanth career

More Telugu News