Budda Venkanna: గొల్లపూడి భూములపై పొలిటికల్ హీట్... రెడ్ బుక్ తీస్తానన్న బుద్దా వెంకన్న

Budda Venkanna Reacts to Gollapudi Lands Controversy
  • విజయవాడ ఉత్సవ్‌పై రగడ
  • ఆలయ భూములపై టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం
  • పేర్ని నాని ఆరోపణలపై బుద్దా వెంకన్న ఫైర్
విజయవాడలో నిర్వహించ తలపెట్టిన ‘విజయవాడ ఉత్సవ్’ కార్యక్రమం టీడీపీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఉత్సవాల పేరుతో కూటమి ప్రభుత్వం విలువైన దేవాలయ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపిస్తుండగా, ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని టీడీపీ గట్టిగా బదులిస్తోంది.

విజయవాడ గొల్లపూడిలోని గొడుగుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 39.99 ఎకరాల భూమిని లీజు పేరుతో శాశ్వతంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. పర్యాటక ప్రోత్సాహం, ఎగ్జిబిషన్ ముసుగులో ఈ భూములను కొట్టేయాలని చూస్తున్నారని, ఇందులో టీడీపీ నేతల ప్రమేయం కూడా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనల ప్రకారం, ఇందులో 5 ఎకరాలను గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్‌కు, మిగిలిన 34.99 ఎకరాలను విజయవాడ ఉత్సవ్ కోసం శాశ్వత ఎగ్జిబిషన్ గ్రౌండ్‌గా కేటాయించబోతున్నారని ఆయన వివరించారు.

వైసీపీ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. కేవలం ఉత్సవాలను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే దేవినేని అవినాశ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని వంటి వారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్సవాలు ముగిసిన వెంటనే ఆ భూములను తిరిగి దేవదాయ శాఖకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న... వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఒక్కొక్కరి జాతకాలు తన రెడ్ బుక్ నుంచి బయటకు వస్తాయని అన్నారు. ముందుగా మచిలీపట్నంలోని దేవదాయ భూముల దోపిడీపై పేర్ని నాని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
Budda Venkanna
Vijayawada Utsav
Gollapudi lands
YCP allegations
TDP counter
Devineni Avinash
Vellampalli Srinivas
Perni Nani
Andhra Pradesh politics

More Telugu News