Jagan Mohan Reddy: రైతుకు రూ.3, బయట రూ.32.. ఇదేం పాలన?: చంద్రబాబు సర్కార్‌పై జగన్ ఫైర్

Jagan Fires at Chandrababu Over Farmer Distress
  • కర్నూలులో కిలో ఉల్లి రూ.3, టమాటా రూ.1.5కు పడిపోయిందని జగన్ ఆవేదన
  • ప్రభుత్వ కొనుగోలు హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆరోపణ
  • ప్రభుత్వం వెంటనే పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్
ఉల్లి, టమాటా పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని, ఇందుకు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

పంట ధరల పతనంలో చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోందని జగన్ ఎద్దేవా చేశారు. "కర్నూలులో కిలో ఉల్లి ధర కేవలం మూడు రూపాయలు, కిలో టమాటా రూపాయిన్నరకు పడిపోయింది. ఈ ధరలతో రైతు ఎలా బతకాలి?" అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గత కొన్ని వారాలుగా రైతులు తీవ్ర ఆవేదనతో గగ్గోలు పెడుతున్నా, ప్రభుత్వం కనీసం కనికరం చూపడం లేదని దుయ్యబట్టారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని ప్రభుత్వం ఉండి ఏం లాభమని ఆయన నిలదీశారు.

క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయాయని జగన్ ఆరోపించారు. కర్నూలు మార్కెట్‌లో తూతూమంత్రంగా వేలం నిర్వహించి, కొనేవారు లేరనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, కానీ అదే ఉల్లిపాయలు ఆన్‌లైన్ స్టోర్లలో కిలో రూ.29 నుంచి రూ.32 వరకు, రైతు బజార్లలో రూ.25కు అమ్ముతున్నారని ఆయన గుర్తుచేశారు. రైతులకు, రిటైల్ ధరలకు మధ్య ఇంత వ్యత్యాసం ఉండటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు.

ఉల్లితో పాటు టమాటా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉందని, కొనేవారు లేక పంటను రోడ్ల పక్కన పారబోస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలవాలని, మానవత్వం చాటుకోవాలని డిమాండ్ చేశారు. 
Jagan Mohan Reddy
YS Jagan
Chandrababu Naidu
Andhra Pradesh
Onion price
Tomato price
Farmers protest
Kurnool
Agriculture crisis
Rythu Bazar

More Telugu News