టీమిండియా తీరుతో షాక్ అయ్యాను... మేము కూడా చాలా మాట్లాడగలం: షోయబ్ అక్తర్

  • ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం
  • మ్యాచ్ ముగిశాక పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని టీమిండియా
  • కరచాలనం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయిన పాక్ ప్లేయర్లు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • ఇది చాలా బాధాకరం అన్న షోయబ్ అక్తర్
ఆసియా కప్ 2025లో దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా అద్భుత విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఓ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే, భారత ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించి సునాయాస విజయాన్ని నమోదు చేసింది. విజయం ఖరారైన వెంటనే, సూర్యకుమార్ యాదవ్ సహా భారత ఆటగాళ్లందరూ సంప్రదాయబద్ధంగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం (షేక్ హ్యాండ్) చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. పాకిస్థాన్ ఆటగాళ్లు మైదానంలో షేక్ హ్యాండ్ కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయంపై దుమారం రేగింది.

భారత ఆటగాళ్ల ఈ ప్రవర్తనపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియా తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. "ఈ దృశ్యాలు చూసి నేను నిశ్చేష్టుడినయ్యాను. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. దయచేసి క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయం చేయొద్దు. మేము మీ గురించి మంచి మాటలే చెప్పాం. ఈ షేక్ హ్యాండ్ ఇవ్వని విషయంపై మేం కూడా చాలా మాట్లాడగలం. ఇంట్లో కూడా గొడవలు జరుగుతుంటాయి, వాటిని అక్కడితో వదిలేసి ముందుకు సాగాలి. ఇది క్రికెట్ ఆట, షేక్ హ్యాండ్ ఇచ్చి మీ హుందాతనాన్ని ప్రదర్శించండి" అని అక్తర్ హితవు పలికారు.

దేశవ్యాప్తంగా ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే పిలుపులు వచ్చిన నేపథ్యంలో, ఈ సంఘటన క్రీడా వర్గాల్లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News