థియేటర్ లో ఆఫీస్ వర్క్ చేస్తున్న యువతి... కార్పొరేట్ సంస్థలపై నెటిజన్ల ఫైర్

  • బెంగళూరు థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో కనిపించిన యువతి
  • థియేటర్‌లో ఆఫీసు పనిలో నిమగ్నం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
  • కార్పొరేట్ పని ఒత్తిడికి నిదర్శనమంటూ నెటిజన్ల ఆగ్రహం
  • ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని గౌరవించాలంటూ హితవు
సినిమా థియేటర్‌కు వెళ్లేది కాసేపు రిలాక్స్ అవ్వడానికి. కానీ, ఆ చీకట్లో వెండితెరపై సినిమా వెలుగుతుంటే, ఓ యువతి మాత్రం తన ల్యాప్‌టాప్ ఆన్ చేసుకుని ఆఫీస్ పనిలో మునిగిపోయింది. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ వింత ఘటనకు సంబంధించిన ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నగరంలోని కార్పొరేట్ వర్క్ కల్చర్‌పై తీవ్రమైన చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే, ఇటీవల ఓ వ్యక్తి 'లోక' అనే సినిమా చూసేందుకు బెంగళూరులోని ఓ థియేటర్‌కు వెళ్లాడు. తన ముందు వరుసలో కూర్చున్న ఓ యువతి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి తీవ్రంగా పనిచేస్తుండటం గమనించాడు. ఈ దృశ్యాన్ని ఫొటో తీసి రెడిట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశాడు. "బెంగళూరులో ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం" అంటూ దానికి ఓ వ్యాఖ్యను జోడించాడు.

ఈ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కొన్ని ఐటీ, కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను బానిసల్లా చూస్తున్నాయని, వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా హరిస్తున్నాయని మండిపడుతున్నారు. "ఇది 'వర్క్ ఫ్రమ్ హోమ్' కాదు, 'వర్క్ ఫ్రమ్ థియేటర్'లా ఉంది" అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. వినోదం కోసం కేటాయించిన సమయంలో కూడా పని చేయాల్సి రావడం పని ఒత్తిడికి పరాకాష్ఠ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తమ వైఖరి మార్చుకుని, ఉద్యోగుల వ్యక్తిగత సమయానికి విలువ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ఒక్క ఫొటో బెంగళూరులోని కార్పొరేట్ ప్రపంచంలో నెలకొన్న తీవ్రమైన పని ఒత్తిడికి అద్దం పడుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 


More Telugu News