London Protest: ‘మా దేశం మాకిచ్చేయండి’.. వలసలకు వ్యతిరేకంగా దద్దరిల్లిన లండన్

London shaken by anti immigration protests led by Tommy Robinson
  • లండన్‌లో వలసలకు వ్యతిరేకంగా లక్షలాది మందితో భారీ ప్రదర్శన
  • ‘మా దేశం మాకివ్వండి’ అంటూ నినాదాలతో హోరెత్తిన వీధులు
  • నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ.. 26 మంది పోలీసులకు గాయాలు
  • జాతీయవాద నేత టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన
  • ఆందోళనకు వర్చువల్‌గా మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్
బ్రిటన్‌లో వలసదారుల సంఖ్య పెరిగిపోవడంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ దేశాన్ని తమకే వదిలేయాలంటూ లక్షలాది మంది లండన్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. "మా దేశాన్ని మాకు ఇచ్చేయండి" (Give us our country back) అనే నినాదాలతో శనివారం సాయంత్రం లండన్ నగరం దద్దరిల్లింది. ఈ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో పోలీసులతో ఘర్షణ చోటుచేసుకుంది.

జాతీయవాద నేత టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్ష మందికి పైగా నిరసనకారులు యూకే జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉండే వైట్‌హాల్ ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 26 మంది పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పాలస్తీనా, ఇస్లామిక్ స్టేట్ జెండాలను చించివేసి తమ నిరసన తెలిపారు.

ఈ ఆందోళనలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. "నియంత్రణ లేని వలసలతో బ్రిటన్ వేగంగా పతనమవుతోంది. మీరు హింసను ఎంచుకోకపోయినా, హింసే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. దాన్ని ఎదుర్కోవాలి, లేదంటే ప్రాణాలు వదలాలి. ఇదే వాస్తవం" అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, టామీ రాబిన్సన్ నిరసనకు వ్యతిరేకంగా పలువురు బ్రిటన్ ఎంపీలు, వామపక్ష నేతలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు సుమారు 5 వేల మందితో కౌంటర్ ర్యాలీ నిర్వహించారు. రాబిన్సన్ మద్దతుదారులను జాత్యహంకారులుగా, మహిళా వ్యతిరేకులుగా వారు ఆరోపించారు.

ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి వలసలు, శరణార్థుల సంఖ్య పెరిగిపోవడంతో తమ సంస్కృతి దెబ్బతింటోందని, నేరాలు అధికమవుతున్నాయని బ్రిటన్‌లోని జాతీయవాద వర్గాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2024 చివరి నాటికి దేశంలో 5,15,697 మంది అధికారిక శరణార్థులు ఉన్నారు. మరో లక్షా 24 వేల మందికి పైగా ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న వారి సంఖ్య 10 నుంచి 15 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.
London Protest
Tommy Robinson
UK immigration
Elan Musk
Give us our country back
UK refugees
Anti immigration protest
Nationalist protest
Whitehall protest
Britain immigration crisis

More Telugu News