GST Reduction: షాపుల ముందు కొత్త బోర్డులు పెట్టాల్సిందే.. జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కీలక ఆదేశాలు

Nirmala Sitharaman Orders New Boards for GST Reduction
  • 350కి పైగా వస్తువులపై భారీగా తగ్గిన జీఎస్టీ
  • ప్రతి దుకాణంలో కొత్త పన్ను రేట్ల బోర్డు తప్పనిసరి
  • ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు
  • నాలుగు నుంచి రెండుకు తగ్గిన పన్ను శ్లాబులు
  • నిబంధనలు పక్కాగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం
వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 350కి పైగా వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు పూర్తిగా చేరేలా చూడటానికి, ఇకపై ప్రతి దుకాణంలోనూ కొత్త పన్ను రేట్ల వివరాలతో కూడిన బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆమె స్పష్టం చేశారు.

నిన్న‌ చెన్నైలో జరిగిన ‘వికసిత్ భారత్ దిశగా పన్నుల సంస్కరణలు’ అనే సదస్సులో నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా తగ్గిన జీఎస్టీ రేట్లు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల అనేక వస్తువుల ధరలు దిగివస్తాయని అన్నారు.

గతంలో ఉన్న నాలుగు (5%, 12%, 18%, 28%) పన్ను శ్లాబులను ఇప్పుడు రెండు కేటగిరీలకు (5%, 18%) సరళీకరించినట్లు ఆమె వివరించారు. ఈ సంస్కరణ ద్వారా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలపై పన్ను భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ తగ్గింపును క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని, దీనిపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
GST Reduction
Nirmala Sitharaman
GST rates
Tax reforms
Goods and Services Tax
Indian economy
Tax slabs
Central government
Consumer benefits
Vikshit Bharat

More Telugu News