భారతీయుడి హత్య.. నిందితుడిని వదిలిపెట్టం: ట్రంప్ హెచ్చరిక

  • అమెరికాలోని టెక్సాస్‌లో భారత జాతీయుడి దారుణ హత్య
  • క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడి కిరాతకం
  • ఘటనపై తీవ్రంగా స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • బైడెన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ తీవ్ర విమర్శలు
  • నిందితుడికి తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్టు వెల్లడి
అమెరికాలోని టెక్సాస్‌లో భారత జాతీయుడు చంద్ర నాగమల్లయ్యను ఒక అక్రమ వలసదారుడు అత్యంత పాశవికంగా తల నరికి చంపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, చట్టపరంగా అత్యున్నత స్థాయిలో విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ హత్యకు బైడెన్ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ ఘటనపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో స్పందిస్తూ, "డల్లాస్‌లో ఎంతో గౌరవనీయమైన వ్యక్తి చంద్ర నాగమల్లయ్యను, ఆయన భార్యాబిడ్డల కళ్లెదుటే క్యూబా నుంచి వచ్చిన ఒక అక్రమ వలసదారుడు అత్యంత కిరాతకంగా తల నరికి చంపిన భయంకరమైన వార్త నా దృష్టికి వచ్చింది. అసలు మన దేశంలో ఉండకూడని వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు" అని పేర్కొన్నారు. నిందితుడికి గతంలో లైంగిక వేధింపులు, వాహనాల దొంగతనం, అక్రమ నిర్బంధం వంటి తీవ్రమైన నేర చరిత్ర ఉందని, అయినా బైడెన్ ప్రభుత్వం అతడిని సమాజంలోకి విడుదల చేసిందని ట్రంప్ విమర్శించారు. "ఇలాంటి నేరస్థుల పట్ల మెతక వైఖరికి నా హయాంలో కాలం చెల్లింది" అని ఆయన హెచ్చరించారు.

అస‌లేం జ‌రిగిందంటే.. 
సెప్టెంబర్ 10న డల్లాస్‌లోని ఒక మోటెల్ వద్ద 41 ఏళ్ల చంద్ర నాగమల్లయ్యపై 37 ఏళ్ల యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి, తల నరికి చంపేశాడు. అనంతరం మృతుడి తలను సమీపంలోని చెత్తకుండీలో పడేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు నిందితుడు మార్టినెజ్‌ను అరెస్టు చేసి, ఫస్ట్-డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) కూడా స్పందించింది. నిందితుడిని దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ప్రారంభించిందని తెలిపింది. "బైడెన్ ప్రభుత్వం ఈ క్రిమినల్ అక్రమ వలసదారుడిని దేశంలోకి విడుదల చేయకుండా ఉంటే, ఈ దారుణమైన, అనాగరిక హత్యను పూర్తిగా నివారించవచ్చు" అని డీహెచ్‌ఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లి ఒక ప్రకటనలో ఆరోపించారు. మార్టినెజ్‌ను బైడెన్ పరిపాలనలో 2025 జనవరి 13న ఐసీఈ కస్టడీ నుంచి పర్యవేక్షణ ఉత్తర్వులపై విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.


More Telugu News