Rajinikanth: వాళ్లు మరణించినా ధైర్యంగా ఉన్న ఇళయరాజా, బాలు చనిపోతే తట్టుకోలేకపోయారు: రజనీకాంత్

Rajinikanth on Ilayarajas reaction to SP Balasubrahmanyams death
  • సంగీత దర్శకుడు ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థానంపై తమిళనాడు ప్రభుత్వ సన్మానం
  • హాజరైన సీఎం స్టాలిన్, రజనీకాంత్, కమల్‌హాసన్
  • బాలు మరణవార్త విని ఇళయరాజా కన్నీటిపర్యంతమయ్యారని చెప్పిన రజనీకాంత్
  • సొంతవారి మరణానికి చలించని ఆయన బాలు కోసం ఏడ్చారని వెల్లడి
సోదరుడు, అర్ధాంగి, కుమార్తె మరణించినప్పుడు కూడా కంటతడి పెట్టని సంగీతజ్ఞాని ఇళయరాజా... ప్రాణ స్నేహితుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) మరణవార్త విని వెక్కివెక్కి ఏడ్చారని సూపర్ స్టార్ రజనీకాంత్ భావోద్వేగంగా వెల్లడించారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలని ఆయన పేర్కొన్నారు. ఇళయరాజా, బాలు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంగీత ప్రపంచంలో ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, నటులు కమల్‌హాసన్, ప్రభు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్, ఇళయరాజ-ఎస్పీబీ మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

"కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా ఇళయరాజా ఎంతో ధైర్యంగా నిలబడ్డారు. అలాంటిది, ఎస్పీబీ మరణించారని తెలియగానే ఆయన తట్టుకోలేకపోయారు. తీవ్రమైన భావోద్వేగానికి గురై చిన్నపిల్లాడిలా ఏడ్చారు" అని రజనీకాంత్ ఆనాటి సంఘటనను వివరించారు.


Rajinikanth
Ilayaraja
SP Balasubrahmanyam
SPB
Tamil Nadu government
MK Stalin
Udhayanidhi Stalin
Kamal Haasan
Tamil cinema
Music composer

More Telugu News