రోడ్డుపై చెత్త వేసే వారిపై జీహెచ్ఎంసీ, పోలీసుల ఉక్కుపాదం... పలువురిపై కేసులు నమోదు!

  • రోడ్డుపై చెత్త.. ప్రార్థనా మందిరాల వద్ద గొడవలు
  • హైదరాబాద్‌లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
  • చెత్త వేస్తే జరిమానా మాత్రమే కాదు.. జైలు శిక్ష కూడా
హైదరాబాద్‌లో రోడ్డుపై చెత్త వేయడం సర్వసాధారణమే కదా అని తేలికగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై అలా చేస్తే జరిమానాతో సరిపోదు, ఏకంగా 8 రోజుల పాటు జైలు ఊచలు లెక్కించాల్సి రావచ్చు. నగరంలో రోడ్లపై చెత్త వేసే వారిపై హైదరాబాద్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కేవలం అపరిశుభ్రతకే కాకుండా, కొన్నిచోట్ల సామాజిక ఉద్రిక్తతలకు కూడా దారితీస్తుండటంతో అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఎందుకీ కఠిన నిర్ణయం?

నగరవాసులు రోడ్ల పక్కన పడేస్తున్న చెత్త, ముఖ్యంగా మాంసాహార వ్యర్థాలను వీధికుక్కలు, పిల్లులు వంటి జంతువులు లాక్కెళ్లి సమీపంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇళ్ల ముందు పడేస్తున్నాయి. ఈ కారణంగా సున్నితమైన ప్రాంతాల్లో వివాదాలు తలెత్తి, స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో, ఈ సమస్యకు మూలకారణమైన రోడ్లపై చెత్త వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌కు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

చట్టపరమైన చర్యలు షురూ:

ఇప్పటికే ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు చర్యలు ప్రారంభించారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే రోడ్లపై చెత్త వేస్తున్న ఐదుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని పట్టుకోవడానికి సీసీ కెమెరా ఫుటేజీని కీలక ఆధారంగా ఉపయోగించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి వారికి తలా వెయ్యి రూపాయల జరిమానా విధించారు.

ఈ సందర్భంగా బోరబండ ఇన్‌స్పెక్టర్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ, "రోడ్లపై చెత్త వేసేవారిపై సెక్షన్ 70(బి), 66 సీపీ యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ 292 కింద కేసులు నమోదు చేస్తున్నాం. కోర్టులో నేరం రుజువైతే చట్ట ప్రకారం 8 రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి" అని హెచ్చరించారు. నగరంలో చెత్త ఎక్కువగా వేసే ప్రాంతాలను (హాట్‌స్పాట్‌లను) గుర్తించి, అక్కడ సీసీ కెమెరాల ద్వారా నిఘాను మరింత పటిష్ఠం చేసినట్లు అధికారులు తెలిపారు. 



More Telugu News