నష్టాలు వస్తున్నాయి.. మెట్రో రైలు నడపలేం: ఎల్ అండ్ టీ లేఖ

  • భారీ నష్టాల వల్ల హైదరాబాద్ మెట్రో నిర్వహణ కష్టమన్న ఎల్ అండ్ టీ
  • తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన నిర్మాణ సంస్థ
  • నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే యోచన
  • కేంద్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శికి లేఖ రాసిన అధికారులు
భాగ్యనగరానికి మణిహారంగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణపై ఎల్ అండ్ టీ సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుస నష్టాల కారణంగా మెట్రోను ఇకపై నడపడం తమ వల్ల కాదని, నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు ఎల్ అండ్ టీ ఉన్నతాధికారులు లేఖ రాశారు.

గత కొంతకాలంగా మెట్రో రైలుకు ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని, దీనికి తోడు పేరుకుపోయిన బకాయిలతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని లేఖలో పేర్కొన్నారు. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని, ఈ పరిస్థితుల్లో మెట్రోను నడపడం తమకు భారంగా మారిందని ఎల్ అండ్ టీ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే, మెట్రో నిర్వహణను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు వారు తెలిపారు. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఆర్థికంగా భారంగా పరిణమించిన మెట్రో రైలు నిర్వహణ తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది.


More Telugu News