Maoist Sujathakka: పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత సుజాతక్క లొంగుబాటు

Maoist Leader Sujathakka Surrenders Before Police
  • ఆమెతో పాటు మరో ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు
  • దివంగత నేత కిషన్‌జీ భార్యగా సుజాతక్కకు ప్రత్యేక గుర్తింపు
  • సుజాతక్కపై వివిధ రాష్ట్రాల్లో 106 కేసులు 
  • మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు
  • డీజీపీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన
మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, దివంగత అగ్రనేత కిషన్‌జీ భార్య అయిన పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లు స‌మాచారం. 

ఈ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలోనే సుజాతక్కతో పాటు లొంగిపోయిన మిగతా వారిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వారి లొంగుబాటుకు దారితీసిన కారణాలను, భవిష్యత్ కార్యాచరణను పోలీసులు వివరించనున్నారు.

గద్వాల్ ప్రాంతానికి చెందిన సుజాతక్క చాలా చిన్న వయసులోనే విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. 1984లో ఆమె మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీని వివాహం చేసుకున్నారు. 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఆమెపై వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 106 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె ఛత్తీస్‌గఢ్‌ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జిగా, జనతన సర్కార్ ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.
Maoist Sujathakka
Sujatha
Maoist leader
surrender
Kishenji wife
Potula Kalpana
Gadwal
Chhattisgarh
Naxalite movement

More Telugu News