Musi River: హైదరాబాద్‌లో మూసీ ఉగ్రరూపం.. ముసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత

Musi River in spate Musarambagh Bridge closed in Hyderabad
  • ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకల బంద్
  • హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్ల ఎత్తివేతతో పెరిగిన ప్రవాహం
  • గోల్నాక బ్రిడ్జిపై భారీగా పెరిగిన ట్రాఫిక్ రద్దీ
  • నార్సింగ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు కూడా మూసివేత
హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లను ఎత్తివేయడంతో మూసీ నదికి వరద పోటెత్తింది. ప్రవాహ ఉద్ధృతి పెరిగి ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు కీలకమైన ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేశారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచే ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడం మొదలైంది. దీంతో అప్రమత్తమైన మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు‌. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ముసారాంబాగ్ మార్గాన్ని మూసివేయడంతో వాహనాలను గోల్నాక బ్రిడ్జి వైపు మళ్లించారు. ఫలితంగా గోల్నాక మార్గంలో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి, ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది.

గత రాత్రి 7 గంటల సమయంలో అధికారులు జంట జలాశయాల గేట్లను మరింతగా ఎత్తివేశారు. ఉస్మాన్‌సాగర్ (గండిపేట) ఐదు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని, హిమాయత్‌సాగర్ నాలుగు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. ఈ భారీ ప్రవాహం కారణంగా నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుతో పాటు హిమాయత్‌నగర్‌లోని సర్వీస్ రోడ్డును కూడా మూసివేశారు. దీంతో నార్సింగ్, మంచిరేవుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Musi River
Hyderabad floods
Musarambagh Bridge
Himayath Sagar
Osman Sagar
Twin reservoirs
Hyderabad traffic
Telangana rains
Flood alert
Golkonda Bridge

More Telugu News