Harbhajan Singh: బీసీసీఐ బాస్ రేసులో హర్భజన్ సింగ్.. తెరపైకి మాజీ స్పిన్నర్ పేరు!

Harbhajan Singh in BCCI President Race
  • భజ్జీ పేరును ప్రతిపాదించిన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్
  • ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా హర్భజన్
  • ఈ నెల 28న బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికలు
  • ఇటీవల వినిపించిన సచిన్ పేరు.. ఖండించిన ఆయన టీమ్
  • నామినేషన్ల ప్రక్రియపై త్వరలో స్పష్టత
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల బరిలో టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ అత్యున్నత పదవి కోసం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) 45 ఏళ్ల హర్భజన్ పేరును ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, నామినేషన్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నిబంధనల ప్రకారం, ఏదైనా రాష్ట్ర క్రికెట్ సంఘం మద్దతు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు.

భారత్ తరఫున 367 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హర్భజన్, అన్ని ఫార్మాట్లలో కలిపి 700కు పైగా వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన ప్రజా జీవితంలోనూ చురుగ్గా ఉంటున్నారు. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఆయన పేరు వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బీసీసీఐ ఎన్నికల ప్రక్రియ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారి ఏకే జోటి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20, 21 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అవసరమైతే సెప్టెంబర్ 28న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. కార్యదర్శిగా దేవాజిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, సంయుక్త కార్యదర్శిగా రోహన్ దేశాయ్ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవలే సచిన్ టెండూల్కర్ పేరు కూడా అధ్యక్ష పదవికి వినిపించినప్పటికీ, ఆ వార్తలను ఆయన ప్రతినిధులు ఖండించారు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ నిజంగానే బరిలో ఉంటాడా? లేదా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.
Harbhajan Singh
BCCI
Board of Control for Cricket in India
BCCI President
Indian Cricket
Cricket Elections
Punjab Cricket Association
PCA
Sachin Tendulkar

More Telugu News